వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'కలల తీరం' కవిత

మిగిలిపోయిన మరకల్ని కడుక్కోలేము
విరిగిపడిన వీర్యకణాల కలల దారుల్లో
మలిగిపోయిన జ్ఞాపకాల జ్వాలల వెలుగుల్ని వెతుక్కోలేము
ఆసాంతం తన్ను తాను పారేసుకునే
ఒక్క వివశత్వమైనా లేని
అనేకానేక తడి రాత్రుల నీడల్ని తడుముకోలేము
ప్రజ్వలించిన ఒక ఉజ్వల తార
మంచుకొండల్ని ఢీకొట్టి
మరణించిన వైనాన్ని వివరించలేను
ఒంటరితనపు చితిమంటల కౌగిలిలో వేగిన గుండె
పోటుకు గురైతే
ఆత్మహత్యించుకున్న ఆకాంక్షల ఆటుల విస్మరించలేము
తిరగబడ్డ పిండపు ఎదురుగాళ్ల ప్రసవంలో
వేలు పెట్టిందో ఏదో తెలియదు
ఎంతకూ ఒడవని ప్రసూతిలో
పుట్టబోయేది ఏ బిడ్డో ప్రకటించలేము
శీర్షాసనం వేసిన లోకంలో
తలక్రిందులు నడుస్తూ
ఏ తీరాన్నీ చేరలేము
- డాక్టర్ కాసుల లింగారెడ్డి