స్కైబాబా కవిత 'ఐ'

అందమైన చిన్నప్పటి కన్ను పాఠం...
కనుబొమ్మ ఎంత ముద్గుగా గీసెటోన్నో
ఇప్పట్కీ కళ్లల్ల తిరుగుతున్నది
చిన్నతనం పెన్సిల్ మల్లమల్ల దిద్దిన నెమలి కన్ను
కన్ను అంటే సాలు - అందమైన బొమ్మే మెదిలేది
పెద్దయినంక తెలిసొచ్చె -
అందమైన కన్నుకు - మాకు శానా దూరమని...
అరెరె.... తేరుకునే లోపల్నే
కాలం కన్ను సానా కారిపాయె
ఇప్పుడు కన్ను అంటె...
ఎంతకు నిద్దుర పట్టక
జీవం లేనట్లు కదలాడే గరీబు ఖాజా మియా-
పంక్చర్లు బాగు చేసే ఉస్మాన్ భాయ్ ఢీలా పడ్డ చూపు..
మా అమ్మీ కంటి కింద నల్లగా - పగిలిన రేగడి!
ఊల్లె శానా ముస్లిం ఇండ్లల్ల పెండ్లి కాని చెల్లెల్లా -
అబ్బాజాన్ పక్షవాతపు రెప్పల మధ్య అడ్డంగా -
కళ్లద్దాలు మసకబారి కుట్టు మిషన్ సూదిల
దారం ఎక్కని నానీమా తనుకులాట...
ఇయాల కన్ను అంటె -
కొడుకు గూడలు పట్టుకుని లేవాల్సింది పోయి
చీకటి పడితే గోడలు పట్టుకుని నడిచే మాదిగ ఎంకయ్య తాత...
ఎద్దు కొమ్ము విదిలిస్తే...
కారిపోయిన నాగయ్య మామ కొడుకు ఒంటరి చూపు...
పగిలిన ఒంటి కన్ను అద్దంతో
కనాకష్టాలు పడే పెరిక లచ్చువమ్మ..
చిన్నతనంలో కొడుకుని తడిమి తడిమి చూసుకున్న యాదిల
వాడు తప్పిపోయిన పట్నం బాటకు అతుక్కొని చితికిపోయిన ఈదయ్య కక్కయ్య...
అయ్యో తలుచుకుంటే ఊరంతా పరేశాన్లతోని
కళ్లన్నీ గుంతలు పడి చూపానకుంటయ్యె
కన్ను ఇప్పుడు అందమైన బొమ్మ కాదురా తమ్మీ
అగాధపు లోతుల్ని చూసే గుంత...
మా ఊరే ఇప్పుడు
కన్ను ఊడబెరికిన ఖాళీ బొయ్యారం...!












Click it and Unblock the Notifications