కవిత 'మన సంతకం'

ముఖం సంతక అంతరంగం
మనస్సు పుస్తకానికి సంతకమే ముఖచిత్రం
సిగ్నేచర్ నేర్వరాని పాస్ వర్డ్
చేవ్రాలు కళాత్మకమైన చిక్కుముడి
దస్తకత్ చేస్తే తలకాయ ఊపినట్లే
హాజరు పట్టికలో చేస్తే
ఆ నెల వేతనాన్ని ఖరారు చేస్తది
ప్రామిసరీ నోట్ మీద చేస్తే
రుణగ్రహీత్ జాబితా చేరుస్తది
చెక్కు మీద చేస్తే
నగదు కళ్ల చూపిస్తది
సూరిటీ బాండ్ మీద చేస్తిమా
తినకున్నా కక్కెయ్యవచ్చు
సంతకం మనిషిని పట్టిచ్చే నిశానీ
వ్యక్తిత్వపు ఐకాన్
కొన్ని సంతకాలు ద్రాక్షపండ్ల గుత్తులు
సాన్పు వాకిట్ల పూసిన ముగ్గులు
వేళ్ల కొసల నుంచి ముగ్గు రాలినట్లు
ముత్యాల వలె ముచ్చటనిపిస్తాయి
కొన్ని అయితే కొంగలు తొక్కిన మడికట్లే
సంతకం ఒక అనుభూతి శ్వాస
ఆత్మను అద్దంలో చూసికున్నట్లు
తాళం చెవిని కలంలో దాచినట్లు
సంతకం చేస్తేనే సాగుబాటు
సెలవు చీటీ కిందా సంతకమే
ప్రేమ లేఖ కిందా సంతకమే
కవిత్వ పంక్తుల కిందా సంతకమే
సంతకం మనిషి ఆచూకీ
సంతకం ఒక ఆమోదం ఒక ఆనందం
- అన్నవరం దేవేందర్