వెలితి (తెలుగు కవిత)

ఎండుటాకుల మూగతనం
శిథిలాల మధ్య విహరిస్తున్న
పూర్వీకుల మనోగతం
సమాధుల చుట్టూ పరిభ్రమిస్తున్న
అల్పాయుష్కుల ఓటమి విస్పోటనం
పద్యంలో ప్రతిఫలిస్తున్న
పాళీ విరిగిన ధ్వని తరంగం
ఆటవికపు తొవ్వల్ల కునారిల్లుతున్న
ఎన్‌కౌంటరైన కోకిల రాగం
పలక మీది చీకటిల
అక్షరాన్ని కబళించిన కొండచిలువ
నిదుర పట్టని రాత్రుల ఒత్తిడుల మధ్య
బంధింపబడిన వేకువ నిస్సహాయతనం
సంస్కృతి, సాహిత్యం, కూరాడు
ఎరుక కాని ఎనకటితనం
కోరస్ పాడని గొంతుల నడుమ
పురి విప్పుకోలేని పోరు దరువు
ఎగురుతున్న పక్షి వెంట
వెంటాడుతున్న తుఫాను
జ్ఞాపకాల పెట్టెనిండా
బల్లి పాతర వాసన
పొలంగట్టు, చెరువుకట్ట, పచ్చీసాట
ఊరి నక్షాలోంచి మాయం
వైధవ్యం మోస్తున్న పల్లెతనం
రాజ్యాంగ పుటలను రచిస్తున్న
వేటగాని కొడవలి
బ్యానర్ల చుట్టూ ముసురుకున్న నినాదాలు
పాటగా అల్లుకోని ఏకాకితనం
ఆశ మొగ్గయిందో లేదో
చీడకు తోక మొలవడం
ప్రతోడి ఆటలో
పంజెం పడని కాయగా
నా తెలంగాణ ....
- దాసరాజు రామారావు












Click it and Unblock the Notifications