కవిత 'ఆకురాలు కాలం'

చెట్టు నుంచి విడిపోవడమే కదా
విడిపోవడం ఇంత అందగా ఉుంటుందా
పిల్లగాలికి రెక్కలు విప్పుకొన్న పక్షుల్లా
అలా అలా ఎగిరిపోతూ ఆపైన
నేల వాలుతున్నాయి ఆకులు
తల్లి నుంచి వేరైపోతున్న దిగులు
లేదు
నేలతల్లి ఒడిలోకి ఒడిలోకి చేరుతున్న తుళ్లింతా
ఏది ఏమైనా అవి ఆనందంగా
నీళ్లలో చేపపిల్లల్లా ఎగురుతున్నాయి
ఎన్నెన్ని రంగులు ఏమేమి హంగులు
చిత్రాతి విచిత్రమైన గతులు
పిల్లల చేతుల్లో గాలి పటాల్లా
ఎగురుతూ పోతున్నాయి ఆకులు
కళ్ల ముందు కేరింతలు కొట్టే పాపల్లా
కనిపిస్తాయేమో ఆ చెట్ల తల్లులకు
నిబ్బరంగా నిటారుగా నిలబడి ఉన్నాయి
కొత్త ఇగుళ్ల రాక సంభ్రమం కోసం
సమాయత్తమవుతున్నాయి కాబోలు
నవ తరానికి నాంది పలుకుతున్నాయి
పాత పాటే కానీ కొత్త రాదు కదా
రాలిపోయే ఆకులు కొత్త ఇగుళ్లకు
చోటు చేస్తున్నామనే ధీమాతో
వెంటవెంటనే విడిపోతున్నాయి
కొత్త సృష్టికి తన వంతు సహాయం చేస్తూ
గాలి వీస్తూనే ఉంది మంద్రంగా
- డాక్టర్ పి. సుమతీ నరేంద్ర












Click it and Unblock the Notifications