తెలుగు కవిత 'అనివార్యం'

తెగిన మనసుతో నెత్తుటి మరకల మీదుగా నా అన్వేషణ
చావు నెత్తురులతో శిథిలమై పోయిన తెలంగాణ నేలపై
ఎందుకీ వెయ్యి నాలుకల విష ప్రయోగాలు
నీటి జాడలేని బంజర్ల మీదుగా
వాన జాడలేని కరువుల మీదుగా
మనుషుల మీదుగా - మనసుల మీదుగా
నడక నేర్పిన నా తెలంగాణ
ఎప్పుడూ ఎవడో ఒకడి ఆశకు
జీవితం ముక్కలు ముక్కలుగా తెగిపోతూ
బతుకు మీది నిస్పృహ నిఖార్సైన బలిదానమై
వెక్కివెక్కి ఏడుస్తుంటే
సార్వభౌమాధికారపు పెడరెక్కలు విరిచి కట్టిన
చరిత్ర తెల్లబోతోంది
పొక్కిలైన వాకిలిలోని దీపం నీడలు
పిడికిలిలోంచి జారిపోతున్న చివరి ఆశలా
నన్నే చూసి హెచ్చరిస్తున్న స్పష్టమైన చిత్రం
పుట్టుకకూ చావుకూ మధ్య
మరణయాతన తప్ప మరేమీ లేదంటూ
నా చుట్టూ ఉన్న మౌనం ఉన్నట్టుండి పెదవి విప్పుతుంది
చీకట్లో చిక్కనవుతున్న సమయాన్ని చూసి
పావురాలు కవాతులై కదులుతున్నవి
ఎంగిలి ఆకుల ముందు వెంపర్లాడుతున్న
రాజకీయ వారసత్వం సాక్షిగా
అనివార్యంగా నేను ఆయుధమవుతున్నాను
- ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
పాలపిట్ట మాసపత్రిక సౌజన్యంతో...












Click it and Unblock the Notifications