ముడ్ ముడ్ కే దేఖ్ (కవిత)
చుక్కలు పక్కకు తిరిగి ఒత్తిగిలినప్పుడు నిద్ర లేస్తుంటాను
కలల మోహంలో
దిగులు పడిన మొహాన్నీ దేహాన్నీ చూసినప్పుడు
అక్కున చేర్చుకుని ఓదార్చాలనుకుంటాను
పాత ప్రేయసి మాటల ఓదార్పు వాక్యాలను వినాలనుకుంటాను
జీవితం కాటేసిన తర్వాత ఏదీ ఉండదు
ఫొటోగ్రాఫర్ తీసిన చిత్రాన్ని మోహ ప్రతిమ చేసి ఆరాధిస్తుంటాను
పగలుకీ రాత్రికీ తేడా తెలియకుండా
పారవశ్యంలోనో, పాత వెలుతురులోనో నన్ను నేను చూసుకుంటాను
మనుషులంటే భయమేసి చీకటి గుహలోకి జారిపోతుంటాను
మాటలన్నీ అయిపోయాక ఆగి చూసుకుంటాను
ఎందుకొచ్చారో, ఏం తెచ్చారో తెలియదు

అగడ్తలు తవ్వుతారని భీతీ బెంగా
అకస్మాత్తుగా ఆమె నిద్ర లేస్తుంది
ఏం తల్లీ అంటాను
నిద్రపోలేదా అంటుంది
బెంగగా ఉందంటాను
పగలు మనుషులను చుశావా, మాట్లాడావా అంటుంది
అవున్నిజమే..
మాట్లాడగూడని చోట మాట్లాడానో
నిలబడని చోట నిలబడ్డానో తెలియదు
భయమూ ఆందోళనా
మాటలతో కాదు గానీ మనసుతో చెప్పు అంటుంది
అరుపులూ కేకలూ కాదు గానీ
నాలోకి నేను ముడుచుకోవడం ఒక భయానక దృశ్యం
మత్తిల్లినప్పుడో, మాటా మాటా కలిసినప్పుడో
ఎదురు పడినప్పుడో, ఎదురు పడనప్పుడు కూడా
ఏం మాట్లాడానో, ఎందుకు మాట్లాడానో తెలియదు గానీ..
మనుషులను తలుచుకున్నప్పుడే భయమేస్తుంది
మోహాలు చిట్లిపోయి, ముఖాలు మాత్రమే మిగిలాయి
పగలు నిద్రపోయి, రాత్రి మేల్కోవడం
ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను వీపు మీద మోయడం
చిదిమేసిన కలలను గుర్తు చేసుకోవడం
రోడ్డు ప్రవాహంలో కొట్టుకోపోవడం
ఎప్పటిలాగే ఉండడమూ ఉండకపోవడమూ
జీవితం నేర్పిన పాఠాలను ఎప్పటికప్పడు మరిచిపోవడం
ఆత్మలో రగులుతున్న నిప్పును చల్లార్చకపోవడం
అది మంటై ఎగిసిపడడం అనుభవిస్తూ జీవితం తెల్లారేదాకా..
- కాసుల ప్రతాపరెడ్డి












Click it and Unblock the Notifications