కవిస్వరం: పారువెల్ల కవిత

ప్రకృతిలో ఏ విధమైన మార్పులు వస్తాయో కవితాత్మకంగా చెబుతూ చివరలో జీవితంలోని నిస్సారమైన దశను పారువెల్ల కవిత్వీకరించాడు. లోపలి నుంచి వెలుపలికీ, వెలుపలి నుంచి లోపలికి ప్రవహించడానికి తడి మిగలకపోవచ్చునని దిగులు చెందుతాడు.
ఆధునిక యుగంలో జీవితం యాంత్రికంగా మారిన తర్వాత, ప్రపంచీకరణ దశలో సమూహంలో మనిషి ఒంటరిగా మిగిలిపోతున్న స్థితిలో ప్రహావం ఉంటుంది గానీ దానికి తడి ఉండదు. యాంత్రికంగా జీవనయానం నడుస్తుంది. ఎక్కడా మనసుకు సంబంధించిన ఆర్ద్ర్తత కనిపించదు. దాన్నే కవి తడిలేని ప్రవాహంగా చెబుతున్నాడు. కవిత చదవండి...
- కాసుల ప్రతాపరెడ్డి
తడి లేని ప్రవాహం
ఒక్కొక్కసారి ...
దేహం లోతుల్లోకి మనసు ప్రవహించదు
తడిని గుండెలో దాచుకున్న మట్టి
చెట్టులా నవ్వడమూ కనిపించదు
తీరంలో ఇసుక మీద రాసిన రాతలు
ఏ సంగతి చెప్పకుండానే చెరిగిపోతాయి
అయినా ఏమీ అనిపించదు
మామిడి కొమ్మల చిగురుటాకులు
మసక మబ్బుల్ని చూసి దిగులుపడినా
పూత పూసిన పువ్వంతా రాలిపడినా
ఏ దృశ్యమూ కనిపించదు
ఏ శబ్దమూ వినిపించదు
లోపలినుండి వెలుపలికి
పచ్చదనాన్ని పదే పదే తరుముతున్నట్లూ తెలియదు
అలసి పడుకున్నాక బీడుపడ్డ మైదానంలా మేల్కోవడం
అనుకోకుండానే జరిగిపోతుంది .
ఇక
లోపలినుండి వెలుపలికి
వెలుపలినుండి లోపలికి
ప్రవహించేందుకు తడి మిగలకపోవచ్చు
- పారువెల్ల
కవిసంగమమం కోసం ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications