కవిస్వరం: ముక్కలైన మనసు ...
మనసుకూ మనసుకూ ఉండే అనుబంధాన్ని, పురుషుడికీ, స్త్రీకీ మధ్య ఉండే సాన్నిహిత్యాన్ని ప్రసాద్ అట్లూరి తన ముక్కలైన మనసు కవితలో ఆవిష్కరించారు. అనుబంధం పెనవేసుకుపోయిన తర్వాత ఆ తర్వాత అది తెగిపోతే ఎలా ఉంటుందో, ఎంత వేదనాభరితంగా ఉంటుందో కవి తన కవితలో అత్యంత ఆర్ద్రంగా వినిపించాడు.
నిజానికి, ఇదో విరహ కవిత. కానీ, అనుబంధం తెగిపోతే మనసు పడే వేదనను ఆయన అత్యంత సున్నితమైన పదచిత్రాలతో ఆవిష్కరించాడు. నిజానికి తర్వాత అలుముకునే చిక్కటి చిక్కదనం వెన్నెలకేం తెలియదు. వెన్నెలకు అదేం పట్టదు. ఆ అభివ్యక్తితో కవిత ప్రారంభమై, ముక్కలైన మనసును జ్ఞాపకాతలోత ఎలా అతకగలవ్ అనే ప్రశ్నతో ముగుస్తుంది.
ఆత్మీయురాలు వెన్నెల కురిపించి వెళ్లిపోయిన తర్వాత అలుముకునే చీకటిని పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఆ తర్వత ప్రేమరాహిత్యంతో కాలుష్యానికి గుండె బీటలు వారిపోయింది. ఆ ప్రేమరాహిత్యం వెన్నెలదే, అంటే ఆత్మీయురాలిదే అనే ఆవేదన కవిత అంతటా పరుచుకుంటుంది. గుండె బీటలు వారితే అతికించడం కష్టమే, పగిలిన అద్దంలోని ప్రతిబింబాలను కూర్చడం సాధ్యం కాదు. ఒక్కసారి విడిపోయిన తర్వాత తిరిగి ప్రేమను ఆవిష్కరించుకోవడం సాధ్యం కాదనే భావన కవితలో వ్యక్తమవుతోంది. ఏమైనా, కవిత మనసును హత్తుకుని ఓ విషాద మాధుర్యాన్ని పంచుతుంది.
- కాసుల ప్రతాప రెడ్డి

సగం కురిసి వెలిసిన వెన్నెలకేం తెలుసు
తదనంతరపు చీకటి ప్రవాహాల చిక్కదనం
పరిచయయం పెంచుకోవటమంత సులువుకాదు
మరిచిపోవటం, మానుపట్టి పోవటం..!
ఇద్దరొక్కటై దిగంతాల్ని చుట్టొచ్చాక
ఒకరికోసమొకరం బ్రతకటం జీవితమయ్యాక
ఏమంత న్యాయం నన్నొదిలి నువ్వెళ్ళి పోవటం
నన్ను మాత్రమే ఒంటరి ఒడ్డుకు విసిరేసి పోవటం !
ప్రేమ రాహిత్యపు కాలుష్యానికి చిక్కేగా
గుండె గోడలు బీటలు వారిపోయింది
నిర్లక్ష్యపు చూపుల తాకిడి తగిలేగా
ప్రేమసౌధపు ప్రాకారాలన్నీ శిధిలమైపోయింది!
ఏమాశించి నీ జ్ఞాపకాల గడ్డిపూలింకా
నా మనసు ప్రాంగణంలో పూయిస్తున్నావ్ మరి ..
పగిలిన అద్దంలోనే ప్రతిబింబం ఒక్కటవ్వదే
ముక్కలయిన మనసుని జ్ఞాపకాలతో ఎలా అతకగలవ్ !
- ప్రసాద్ అట్లూరి
అక్టోబర్ 31, 2014












Click it and Unblock the Notifications