• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కవిస్వరం: అదే నేను

By Pratap
|

ఓహ్.. మై గాడ్ అనే హిందీ సినిమాను చూసి, దాని ఆధారంగా తెలుగు వస్తున్న గోపాలా, గోపాలా సినిమాను తలుచుకుని రక్షిత సుమ ఈ కవిత రాశారు. గుజరాతీ నాటిక కంజీ విరుధ్ కంజీ అనే నాటకం ఆధారంగా హిందీలో ఓహ్.. మై గాడ్ అనే సినిమా తీశారు. ఆ నాటకం ఆస్ట్రేలియా చిత్రం మ్యాన్ హూ స్యూడ్ గాడ్ (దేవుడిపై దావా వేసిన మనిషి) సినిమాకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా వ్యంగ్యంతో కూడి ఉంటుంది. ఈ వ్యంగ్యంతో సినిమా అంతా నడుస్తుంది.

నిజానికి, ఈ కథను అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమే. దేవుళ్లు ఉన్నారని చెబుతూ దేవుళ్లకు ప్రతినిధులుగా చెప్పుకునేవారిని తోసిపుచ్చాలనే భావన ఒకటి, విగ్రహారాధన కూడదనే భావన మరోటి ఇమిడి ఉన్నట్లు చెప్పుకోవచ్చు. భూకంపం కారణంగా కూలిన తన దుకాణం బీమా డబ్బుల కోసం దావా వేస్తే బీమా కంపెనీ ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే నష్టానికి బీమా చెల్లింపులు ఉండవని చెబుతుంది. ప్రకృతి విపత్తు దైవేచ్ఛ కారణంగా వచ్చింది. కాబట్టి దైవాన్ని ప్రతివాదిని చేసి, దైవానికి భౌతిక ప్రపంచంలో ప్రతినిధులుగా చెప్పుకుంటున్న పూజారులను ఆ తర్వాత ప్రతివాదులుగా చేసి నడిపించే కేసు విచారణ ఇది.

ఈ మొత్తం వ్యవహారంలో అతనికి కృష్ణ అనే వ్యక్తి (?) సహాయపడుతాడు. చివరగా అతనికి సాయం చేసిన వ్యక్తి దేవుడనే గ్రహింపునకు దావా వేసి, విజయం సాధించిన వ్యక్తి ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సినిమా ముగుస్తుంది. ఒక రకంగా దేవుళ్లంతా ఒక్కటే, సందేశం కూడా ఒక్కటే అనే అర్థాన్ని కూడా స్ఫురింపజేసినట్లు చెప్పవచ్చు. అందుకే వివిధ మతాల దేవుళ్ల గురించి చెబుతూ రక్షిత సుమ ఓ సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. చూడడానికి ఇష్టపడని దేవుడు లేదా మనిషి రూపంలోని దైవం కనిపించదనే ఉద్దేశంతో రక్షిత ఈ కవిత రాసి ఉంటారని అనిపించింది. మొత్తంగా ఓ మంచి కవితను రక్షిత సుమ అందించారు. మనిషి మనసుకు ఆవరించిన చీకటి గురించి ఆమె తన ఆక్రోశాన్ని వినిపించారు.

జ్ఞానం ఇవ్వగలిగిన నేర్పు, మనసుకు మౌనం అద్దటం రాదాయే అనే స్టాంజాలో ప్రేమరాహిత్యాన్ని మాట్లాడారు. ఆ ప్రేమ రాహిత్యమనే గాఢాంధకారంలో ఉన్నవాడికి ఏదీ కనిపించదని చెబుతూ ఆమె కవితను ముగించారు. మనిషి పట్ల మనిషి చూపే ఆప్యాయత, అనురాగం అనేవి కరువు కావడం గురించి ఆమె మాట్లాడారు. అదే దైవం. ఆ దైవానికి విగ్రహాలు, పూజారులు అవసరం లేదనే ఉద్దేశం కవిలో ఉండి ఉంటుంది. అదే నేను అనే శీర్షిక ద్వారా ఆ నేను ప్రేమగా, మనిషి పట్ల మనిషి పట్టింపుగా అర్థం చేసుకోవచ్చు.

- కాసుల ప్రతాపరెడ్డి

Kavisangamam poet: Rakshitha Suma poem

మనిషికి జ్ఞానం రుద్దగల నీకు

మనసుకు మౌనం అద్దటం రాదాయె!

ముసల్మానుననే ముసుగులో నీవొచ్చుంటే

అల్లా అనేది నేనే అనే వెలుగు నీ కళ్ళలో పడనిచ్చేదాన్ని

కిరస్తానీయుడిగా నిన్నునీవు భావించుకుని వుంటే

అజ్ఞానపు వెతల శిలువ భారాన్ని నీపై పడనీకుండా మోస్తున్న జీసస్

నేనేనని చెప్పుండేదాన్ని.

హిందువుగా నిన్ను నీవు భావించుకుని వుంటే

రాముడో, కృష్ణుడో నిక్కావలసిన అవతారమో లేదా జగన్మాతనో నేనేనేని

‘ప్రత్యక్షం' నీకుగా కల్పించగలిగేదాన్ని.

మానవత్వమే నా మతమని పనిచేసుకుంటూ పోయేవాడివైతే

సాటి మనిషిలో దైవత్వంగా నీ మదిలో గూడుకట్టుకునేదాన్ని.

కనీసం నాస్తికుడిగా నీగురించి నీవు నమ్మినా

శాస్త్రవిజ్ఞానపు ఫలం నేనేననే నిజమైనా

చెప్పకుండానే నీకు తెలిసుండేది.

కళ్ళకు రంగుల్ని చూపడం తెలిసిన నీకు

నిశీధిది కూడా వర్ణమేనని తెలుస్తుందేమోనని ఆశించాను.

అయ్యో!

తలుపులు బిడాయించుకున్న చీకట్లో

తడుముకునే నీకు, ఇకపైనయినా నేనెలా కనిపిస్తాను?

- రక్షిత సుమ

08 డిసెంబర్ 2014

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kavisangamam poet Rakshitha Suma has written a poem with the inspiration of Oh.. MY God or Gopala Gopala film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more