కవిస్వరం: నీలోనే ఉన్నా
మంచి కవిత కోసం చాలానే జల్లెడ పట్టాల్సి వచ్చింది. ఇంత వరకు రాసినవారిని మరోసారి స్పర్శించకూడదనే నియమం వల్ల అది తప్ప లేదు. అలా జల్లెడ పట్టిన తర్వత సరిత నీలోనే ఉన్నా కవిత చిక్కింది. "చెలియ చేతి వేడిరి రగిలే.../ యోగమింకా నీ చెంతన లేదు" అనే వాక్యాల దగ్గర కాసేపు ఆగితే మొత్తం కవిత రూపు కట్టినట్లు అనిపించింది. భావ కవిత్వానికి కాలం చెల్లిందని భావిస్తున్న తరుణంలో ఈ కవిత వచ్చింది. ప్రేమ కవిత్వం చాలానే వస్తోంది గానీ దేవులపల్లి కృష్ణశాస్త్రికి వారసులు లేరేమో అని భావిస్తున్న సమయంలో ఈ కవిత దృష్టిని ఆకర్షించింది.
ప్రేయసి జ్ఞాపకాల్లో బతకమని ఈ కవిత చెబుతుందా అనే అనుమానం కలుగుతోంది. మరిచిపోవడానికి కూడా వీలు లేని ప్రేయసి జ్ఞాపకాలను ఈ కవిత తడిమింది. "దరికి రమ్మని పిలువకు ప్రియ.../ తరచి చూసుకో నీలోనే ఉన్నా.." అని ప్రియుడిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. శాశ్వతంగా దూరవుమవుతున్నానని ఓ ప్రేయసి ప్రియుడికి పంపే సందేశంలా ఈ కవిత అనిపించింది.
మొత్తం మీద, స్త్రీలు భావ కవిత్వం రాస్తే ఎలా ఉంటుందో, మనసుకు ఎలా చేరువగా ఉంటుందో ఈ కవిత తెలియజేస్తోంది. ఏమైనా ఒకసారి ఈ కవితను చదివి ఒళ్లంతా పులకరింపజేసుకోవచ్చు.

- కాసుల ప్రతాపరెడ్డి
దరికి రమ్మని దీనంగా పిలవకు ప్రియ...
తరచి చూసుకో నీలోనే ఉన్నా...
కలసి ఉన్న చల్లని వరమూ...
చెప్పుకొనును మెల్లిగ ఎపుడు...
జారిపోయిన అమృత క్షణమూ...
తలచుకొనును మన కథలని ఎపుడు...!
గుబులు పెంచిన మువ్వల సడికి...
పులకరించిన తనువుని అడుగు...
నలిగి మురిసిన పువ్వుల వడికి...
పగిలి చేరిన గాజులనడుగు...!
చెలియ చేతి వేడికి రగిలే...
యోగమింకా నీ చెంతన లేదు.
ఒడిన చేరి కథలను చెప్పే...
వరమింకా మనకు రాసి పెట్టి లేదు...!
తీయనైనా నీ పలుకులలో...
కరిగిపోయిన రోజులు ఎన్నో...
మంచు కరుగు ఆ రవి సెగకి...
నా కనుపాపలలో నీ రూపం కరుగునా...?
చెరిగిపోని చూపుల లోనా...
నిలిచిపోయిన బాసలు ఎన్నో...
రాలిపోవు పువ్వులు ఆ గాలిజడికి...
నీ చూపులు నన్ను మరచునా...?
-సరిత
11 జనవరి 2015












Click it and Unblock the Notifications