కవిస్వరం: నది కవిత
నది గురించి కవితలు చాలానే వచ్చాయి. కానీ, ఓ యువకవి పరిణతి చెందిన కవితను మనకు ఈ వారం కవిసంగమం ద్వారా అందించాడు. నదికీ జీవితానికీ పోలిక తెస్తూ ఆయన ఈ కవిత రాశాడు. ఈ కవిత ద్వారా పాఠకులకు అతను జీవిత పరమార్థాన్ని విప్పి చెప్పాడు. నది ప్రవహిస్తుందనే అందరమూ అనుకుంటాం. కానీ బండరాయి మీద నిలబడి చూస్తే నది ప్రవహిస్తుందనే భ్రమల్లోకి వెళ్తామని అంటున్నాడు సత్యగోపి.
అలా చెప్పడం ద్వారా కవి జీవితం ప్రవహించినట్లే కనిపిస్తుంది గానీ అది ఎక్కడికీ కదలదనే వాస్తవాన్ని చెబుతున్నాడా అనిపిస్తుంది. జీవితంలోని నది గానీ, నదిలాంటి జీవితం గానీ అంటాడు. అలా అనడం ద్వారా రెండింటికీ మధ్య ఉన్న అభేదాన్ని అతను మనకు చెబుతున్నాడు.
జీవితంలోని కష్టసుఖాలను, నదీప్రవాహం ఎత్తుపల్లాలను కూడా అతను పోల్చి చెబుతున్నాడు. ఈ కవిత ద్వారా కవి జీవన తాత్వికతను వెల్లడించాడు. సుఖసంతోషాలను కొలిచే తూనికరాళ్లు తయారు కాలేదేమోబననే సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. మొత్తంగా మనకు సత్యగోపి ఓ మంచి కవితను అందించాడు.
- కాసుల ప్రతాపరెడ్డి

ఒక నది
అవతలొక తీరం ఇవతలొక తీరం
నదిని చూడాలంటే ముందుగా ఒక బండరాయిని
వెతుక్కోవాలి
దానిమీద నిలబడి చూస్తే ఆకాశం మీద
నది పారుతున్నట్టే ఉంటుందనీ భ్రమలోకెళ్తాం
అక్కడక్కడా నక్షత్రాల గులకరాళ్లను
మరిచిపోకూడదు
నది నృత్యం చేయడం తెలీదేమో
వంపుల దగ్గరికెళ్ళి తొంగి చూడగలగాలి
కొన్ని కన్నీళ్ళు ఎగసిపడుతుంటాయి చూశారా...!
మునిగి చూడండి మేఘాల్లో తలను ముంచినట్టుంటుంది
అపుడు కన్నీళ్ళుండవు
నదిలా మనం బ్రతుకుతున్నామని
అవగతమవుతుంది.
ప్రవహిస్తున్నపుడు
జీవితంలోని నదిగాని నదిలాంటి జీవితంగాని
ఎత్తుపల్లాలను
కష్టసుఖాలను
కొలిచే తూనికలు ఇంకా తయారుకాలేదేమో
అసలు నన్నడగకూడదు మీరు
నదిని ప్రేమించడం వెనక జీవితం ప్రవహిస్తుందని
- సత్యగోపి
22-03-2015