• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కవిస్వరం: లెట్ అజ్ లివ్ ఇన్ ఈచ్ అదర్

By Pratap
|

కవి యజ్జపాల్ రాజు ఉపేంద్రం ధిక్కార స్వరం వినిపిస్తున్నాడు. తెలుగు పదాలకు ఇంగ్లీష్ పదాలు, తెలుగు వాక్యాలకు ఇంగ్లీష్ వాక్యాలు జోడించి, ఆ ధిక్కార స్వరాన్ని అభివ్యక్తిలో కూడా ప్రకటించాడు. లెట్ అల్ లివ్ ఇన్ ఈచ్ అదర్ అంటూ ప్రేయసిని పిలుస్తున్నాడు. అలా పిలుస్తూ సమాజాన్ని ధిక్కరిద్దామని చెప్పడమే కాకుండా కట్టడమైనా, కూలగొట్టడమైనా మనిద్దరికే సాధ్యమని ఆత్మవిశ్వాస ప్రకటన చేశాడు.

నిజానికి, ప్రభుత్వ చట్టాలకన్నా భారతదేశంలో సామాజిక నియమనిబంధనలు కష్టతరమైనవి. సామాజిక కట్టుబాట్లను, నిబంధనలను ధిక్కరించడం చాలా కష్టమైన పని. సమాజం పెట్టే క్షోభ, విధించే శిక్ష కఠినాతికఠినంగా ఉంటాయి. చట్టాల కన్నా ఈ నియనిబంధనలే చాలాసార్లు బలమైనవిగా కూడా అనిపిస్తాయి. పరువు హత్యలు జరిగినప్పుడు, ప్రేమికులపై దాడులు చేసినప్పుడు, ప్రేమను అంగీకరించకపోతే ప్రేమికులు పారిపోవడం, పారిపోయి తిరిగి వస్తే అనుభవించే యాతనలను చూస్తూనే ఉన్నాం.

ఆ ఎరుక కవికి ఉందో, లేదో తెలియదు గానీ సామాజికమైన కట్టుబాట్లు మాత్రం తమకు అడ్డంకిగా మారాయనే ఎరుక మాత్రం ఆయనకు ఉంది. ఎరుకతోనే సమాజంపై ఆయన విరుచుకుపడుతున్నాడు. ఆ సామాజిక కట్టుబాట్ల వల్ల తాము పడిన, పడుతున్న వేదనను పలుకుతూనే కలిసి నడుద్దామని, కలిసి జీవిద్దామని ఆహ్వానిస్తున్నాడు. ఈ మణిప్రవాళ శైలి అభివ్యక్తి శైలికి కాకుండా భావానికి, అంతకన్నా ఉద్వేగానికి తావు ఇస్తున్నది. ఇది ఆధునికానంతరం అభివ్యక్తి కూడా కావచ్చు.

Kavisangamam poet Yagnapal Raju Upendram

- కాసుల ప్రతాపరెడ్డి

ఒక మెటామార్ఫసిస్
రెండు బ్రతుకులు

కనుచూపు మేరకు అందని ప్రపంచపు క్లాసు రూములో
కనిపించని జీవితమనే మాస్టారు
చావుదెబ్బలు కొట్టి చాలాసార్లు ఊపిరాడకుండా చేసి
చెప్పిన పాఠాలనుకుందాం

దిస్ సొసైటీ లిటరల్లీ బ్రూటల్లీ రేప్డ్ అజ్ బోత్
పెట్టుడు కట్టుబాట్లతో
రిడిక్యులస్ హిపోక్రసీతో
ఐ సే యూ ఫాలో, ఐ రూల్ యూ సఫర్ సూత్రంతో
మానసికంగా
ఒకరకంగా నిన్ను ఒకరకంగా నన్ను

యూ అండ్ మీ ఆర్ సిక్ ఆఫ్ దిస్

కదా చేతులు కోసుకున్న రక్తపు మడుగుల నీడల్లో
వేదనామయ క్షణాలు లెక్కబెట్టుకున్న సమయాలు మనవి

పగళ్ళు మినిమైజ్డ్ రాత్రుళ్లై
రాత్రుళ్లు నెక్లెస్ రోడ్డుమీది ఫ్లడ్ లైట్ల పగళ్లై
కళ్ళు ఎర్రబారినతనాన్ని సంతరించుకున్న రోజులన్నీ మనవే

కోల్పోయినది కోల్పోయినట్టు వదిలేసినా
నువ్వూ నేనూ ఎదురుపడి దగ్గరైనా
ఒకరినొకరు గాఢంగా హత్తుకోవడానికి ససేమీరా ఒప్పుకోని
మర్యాదల ముసుగులు పాటిస్తున్నవాళ్లం

ఒంటరితనాన్ని వోడ్కాతో పాటు కలుపుకుని
సిగరెట్ల పీకల్లో కూరుకుని తాగిన అనుభవాలు
నీవి నావి మనిద్దరివీ

ఇంకేం చూస్తాం
ఏముంది చూడటానికి

నిద్రలో కూడా మేలుకునే ఉందాం
వానలై కురిసి ఎండలై మండి
చలై వణికి
గాలై వీచి నీరై నిండి
తాపాలై వగచి గుండెలై పగిలి
ఇంకేమైనా ఏదైనా పెద్ద తేడా లేదనుకుందాం

రా వచ్చెయ్ నేను పిలుస్తున్నా
కళ్ళు మిరుమిట్లు గొలిపే వేకువలోనైనా
లెట్ అజ్ లై అండర్ కవర్

చిక్కటి చీకటిలోనైనా
మన ఇద్దరి కళ్ల క్యాండిల్ లైట్ల వెలుగులో
డిన్నర్ చేద్దాం

ఏమైనా కట్టడమైనా కూలగొట్టడమైనా
మనిద్దరికే సాధ్యం
ఇక మనం ఏదీ అడ్డు తొలగించుకోనవసరం లేదు

మనిద్దరి అడుగుల శబ్దానికి అందులోని ఆవేశానికి
అవెప్పుడో భయపడి పక్కకు దొర్లిపోయాయి

ఇంత ఒంటరిగా బ్రతికాక
అంతకుమించి ఒంటరితనాన్ని నీలో చూశాక
ఎలా వదిలి వెళ్లమంటావు

లెట్ అజ్ నాట్ డెలిబరేట్
లెట్ అజ్ లిబరేట్
లెట్ అజ్ లివ్ ఇన్ ఈచ్ అదర్

- యజ్జపాల్ రాజు ఉపేంద్రం
1 జనవరి, 2015

English summary
Kavisangamam poet Yagnapal Raju Upendra in his unique expression calls to revolt against society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X