విశ్వంలో మరో రెండు కొత్త గ్రహాలు.. శాస్త్రవేత్తల మైండ్ బ్లాకింగ్ న్యూస్!
భూమికి వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నిశిధాంబరంలో.. మన సౌర కుటుంబానికి అవతల మరో అద్భుతం వెలుగుచూసింది. నక్షత్ర మండలాల్లో జీవం ఆనవాళ్లు ఉన్నాయా? మనలాంటి మనుషులు ఆ దూర తీరాల్లో జీవించగలరా? అన్న శతాబ్దాల నాటి ప్రశ్నకు బదులు వెతికే క్రమంలో ఒక మైలురాయి లాంటి వార్త ఇది. విశ్వం అంచుల్లో ఎక్కడో నిశ్శబ్దంగా తిరుగుతున్న రెండు వింత గ్రహాలను స్పెయిన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో ఒక గ్రహం సరిగ్గా మన భూమినే పోలి ఉందనే వార్త ఇప్పుడు ఖగోళ రంగాన్ని తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది.
ఖగోళ శాస్త్రవేత్తల బృందం గుర్తించిన ఈ కొత్త ప్రపంచాలకు 'TOI-1752 b', 'TOI-1752 c' అని పేర్లు పెట్టారు. మన భూమికి సుమారు 337 కాంతి సంవత్సరాల దూరంలో 'డ్రాకో' అనే నక్షత్ర మండలంలో ఇవి ఉన్నాయి. అక్కడ ఉండే ఒక చిన్న 'రెడ్ డ్వార్ఫ్' (ఎర్రటి మరుగుజ్జు నక్షత్రం) చుట్టూ ఈ రెండూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. మన సూర్యుడి కంటే పరిమాణంలో, వేడిలో ఇది కాస్త చిన్నదే అయినప్పటికీ.. దాని చుట్టూ తిరుగుతున్న ఈ జంట గ్రహాలు మాత్రం సైంటిస్టులకు చాలా ఆసక్తికరమైన విషయాలను అందిస్తున్నాయి.

ఒకటి నిప్పుల కొలిమి.. మరొకటి మన భూమికి అచ్చమైన రూపం!
ఈ రెండు గ్రహాల్లో మొదటిది 'TOI-1752 b'. ఇది మన భూమి కంటే నాలుగు రెట్లు పెద్దది. అయితే, సూర్యుడికి (తన నక్షత్రానికి) చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇది ఒక నిప్పుల కొలిమిలా మండిపోతోంది. లావా రసంతో నిండిన నరకంలాంటి గ్రహం ఇది. కానీ, రెండో గ్రహమైన 'TOI-1752 c' మాత్రం సైంటిస్టుల కళ్లలో సరికొత్త ఆశలు నింపింది. మన భూమి కంటే ఐదు రెట్లు బరువు ఉండే ఈ రాతి గ్రహంపై నీరు ప్రవహించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణం గనుక సహకరిస్తే.. అక్కడ సమృద్ధిగా నీరు ఉండే అవకాశం ఉందనేది పరిశోధకుల అంచనా.
అధునాతన టెక్నాలజీతో కనిపెట్టిన శాస్త్రవేత్తలు
స్పెయిన్లోని 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆఫ్ అండలూసియా' శాస్త్రవేత్త ఆల్బెర్టో పెలేజ్ టోర్రెస్ నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. టెలిస్కోప్ ద్వారా ఆ నక్షత్రం కాంతిలో వచ్చే స్వల్ప మార్పులను ('ట్రాన్సిట్' పద్ధతి ద్వారా) గమనించి ఈ నూతన గ్రహాల ఉనికిని పసిగట్టారు. కానరీ ఐలాండ్స్, హవాయిలోని శక్తివంతమైన ముస్కాట్ (MuSCAT) పరికరాలు, అలాగే జపాన్ టోక్యో యూనివర్సిటీ పరిశోధకులు కూడా ఈ మహా అన్వేషణలో భాగస్వాములయ్యారు.
ముందుంది అసలైన పరీక్ష!
గ్రహాలనైతే గుర్తించారు కానీ.. ఇకపైనే అసలైన సవాలు మొదలుకానుంది. ఆ సుదూర గ్రహంపై నిజంగానే మనుషులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందా? నీటి ఆనవాళ్లు ఎంతవరకు ఉన్నాయి? అనేది తెలుసుకోవాలంటే రాబోయే రోజుల్లో అధునాతన స్పేస్ టెలిస్కోప్ల ద్వారా అక్కడ వెలువడే కాంతిని విశ్లేషించాల్సి ఉంటుంది. ఒకవేళ దట్టమైన మబ్బుల పొర అడ్డురాకపోతే.. భవిష్యత్తులో విశ్వంలో మనకు మరో 'రెండో భూమి' దొరికినట్లే!














Click it and Unblock the Notifications