సూర్యగ్రహణం వేళ తిరుగుబాటు.. తల నరికిన విగ్రహం వెనుక 2700 ఏళ్ల నాటి పగ!

చరిత్రపుటలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాలంతో పాటు కొత్త పరిశోధనలు బయటపడినప్పుడు పాత ఆధారాల రాతలు మారాల్సిందే. ప్రాచీన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అస్సిరియన్ రాజవంశ చరిత్రలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. సుమారు 2,700 ఏళ్ల నాటి అధికారిక రాజుల జాబితాలో అసలు పేర్లే లేని ముగ్గురు రాజులు నిజానికి ఆ సామ్రాజ్యాన్ని ఏలారని తాజా పరిశోధనలో వెల్లడైంది. మట్టి పలకలు, రాతి శాసనాలు, విరిగిన విగ్రహాల ఆధారాలను ఒక్కటిగా జోడించి పరిశోధకులు ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు.

జాబితాలో లేకపోతే రాజులు కారంటారా?

అస్సిరియన్ సామ్రాజ్యాన్ని ఎవరు, ఏ కాలంలో పాలించారనేదానికి ఇప్పటివరకు 'రాజుల అధికారిక జాబితా'నే ప్రామాణికంగా తీసుకునేవారు. అయితే, నాటి రాజులు తమకు నచ్చని లేదా తమ అధికారాన్ని సవాలు చేసిన స్వల్పకాలిక పాలకుల పేర్లను చరిత్ర నుంచి పూర్తిగా తుడిచేసేవారని శాస్త్రవేత్తలు తేల్చారు. 'జర్నల్ ఆఫ్ క్యూనిఫాం స్టడీస్' పత్రికలో అలెగ్జాండర్ జోహాన్స్ ఎడ్మండ్స్, ఎకార్ట్ ఫ్రామ్ ప్రచురించిన పరిశోధన ప్రకారం.. అధికారిక లిస్టులో లేనప్పటికీ, అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో ముగ్గురు వ్యక్తులు అస్సిరియన్ సింహాసనాన్ని దక్కించుకున్నారు.

Forgotten Kings of Assyria Researchers Uncover Three Lost Rulers Who Shaped Ancient Empire s History

సూర్యగ్రహణం వేళ తిరుగుబాటు చేసిన 'తిగ్లాత్-పిలేసర్'

క్రీస్తు పూర్వం 763-762 కాలంలో అస్సిరియాలో తీవ్ర రాజకీయ అస్థిరత ఏర్పడింది. సరిగ్గా అదే సమయంలో వచ్చిన ఒక సూర్యగ్రహణం తర్వాత అస్సూర్-దాన్ III అనే రాజుపై ఆయన మేనల్లుడు 'తిగ్లాత్-పిలేసర్' తిరుగుబాటు చేశాడు. క్రీ.పూ. 762 నాటి ఒక మట్టి పలకపై ఉన్న రాచరిక ఆదేశాల్లో ఈయన పేరు 'అస్సిరియా రాజు'గా స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి నాటి అధికారిక జాబితా ప్రకారం అస్సూర్-దాన్ III పాలనలో ఉండాలి. అంటే, ఈ కొత్త తిగ్లాత్-పిలేసర్ కొద్దిరోజుల పాటు అధికారాన్ని చేజిక్కించుకున్నాడని, ఆ తర్వాత ఆయనను పదవి నుంచి దించేసి చరిత్ర రికార్డుల నుంచి ఆయన పేరును పూర్తిగా తొలగించారని స్పష్టమవుతోంది.

ఒక్క ఎలుక కోసం 10 ఏళ్ల సుదీర్ఘ వేట! ఊపిరి పీల్చుకున్న ద్వీపం
ఒక్క ఎలుక కోసం 10 ఏళ్ల సుదీర్ఘ వేట! ఊపిరి పీల్చుకున్న ద్వీపం

పేరు చెరిపేసి.. రాతి శాసనాన్ని తిరగరాశారు!

ఇరాక్‌లోని 'టెల్ అబ్తా' ప్రాంతంలో లభించిన ఒక ప్రాచీన రాతి శాసనం ఇన్నాళ్లూ చరిత్రకారులకు పెద్ద చిక్కుముడిగా ఉండేది. ఎందుకంటే ఆ శాసనంపై ఉన్న అసలు రాజు పేరును చెరిపేసి, దానిపై 'తిగ్లాత్-పిలేసర్ III' అనే వేరే రాజు పేరును చెక్కారు. పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. క్రీ.పూ. 747 నుండి 745 మధ్య కాలంలో 'షల్మనేసర్' అనే మరొక రాజు పాలించాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు ఈ షల్మనేసర్ ఉనికిని చరిత్ర నుంచి చెరిపేయడానికి, రాతి శాసనంపై ఆయన పేరును తీసేసి వేరే పేరును చెక్కించారని తేలింది.

తల నరికిన విగ్రహం వెనుక పెద్ద కథే ఉంది!

మూడో రాజు 'అస్సూర్-ఉబల్లిట్' క్రీ.పూ. 913-912 ప్రాంతంలో పాలించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. నాటి ఒక పురాతన క్యూనిఫాం గ్రంథంలో.. అంతకుముందు తుకుల్తీ-నినుర్తా I తయారు చేయించిన ఒక రాచరిక పాత్రను 'అస్సూర్-ఉబల్లిట్' పునరుద్ధరించాడని రాసి ఉంది. అయితే ఈ పేరు అధికారిక రాజుల జాబితాలో లేదు. దీనికి బలం చేకూరుస్తూ ప్రాచీన అస్సూర్ నగరంలో ఒక విచిత్రమైన విగ్రహం దొరికింది. ఆ రాజ విగ్రహం తల నరికివేసి ఉండటమే కాకుండా, రాచరికపు చిహ్నాలు ఉన్న చేతులను కావాలనే ధ్వంసం చేశారు. అప్పట్లో అధికారం కోల్పోయిన ఈ అస్సూర్-ఉబల్లిట్ విగ్రహమే అది అయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

రాజు క్షమాభిక్ష.. 57 మంది మృతి! ఒక్క రాత్రిలో మారిన దేశ తలరాత
రాజు క్షమాభిక్ష.. 57 మంది మృతి! ఒక్క రాత్రిలో మారిన దేశ తలరాత

చరిత్ర అంటే కేవలం గెలిచినవారి రికార్డు మాత్రమే కాదు!

ఈ ముగ్గురు రాజులు కూడా రెండేళ్ల కంటే తక్కువ కాలమే పాలించి ఉండవచ్చని, అందుకే తరువాతి పాలకులు రాజుల జాబితాను 'క్లీన్'గా ఉంచడానికి వీరి పేర్లను తొలగించి ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. అస్సిరియన్ సామ్రాజ్య చరిత్రలో మనకు తెలిసిన దానికంటే ఎక్కువ తిరుగుబాట్లు, రాజకీయం, అధికార పోరాటాలు జరిగాయని ఈ పరిశోధన నిరూపిస్తోంది. ప్రాచీన ఆధారాలను నిశితంగా పరిశీలిస్తే చరిత్రలో మరుగునపడిపోయిన మరిన్ని పాత్రలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+