చందమామపై మనకూ ఒక ఇల్లు- బెంగళూరు IISc థీసిస్
అంతరిక్ష పరిశోధన రంగంలో సరిహద్దులను చెరిపేస్తూ భారత్ మరో మైలురాయి వైపు అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహంపై మానవ నివాసాలను ఏర్పాటు చేసే దిశగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఓ డిఫరెంట్ డిజైన్‌ను ప్రతిపాదించారు. దీనికి భీమ్.. (BHEEM) అంటే భారత్ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్ ఎక్స్‌పాండబుల్ మాడ్యులర్ హాబిటాట్ అని పేరు పెట్టారు.
సాధారణంగా అంతరిక్షంలో నివాస గృహాలను నిర్మించాలంటే అందుకు అవసరమైన సామాగ్రిని రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపించాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనికి మెరుగైన పరిష్కారాన్ని చూపింది.. ఐఐఎస్‌సీ. ఇందులో భాగంగా భీమ్ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసింది. ఇందులో చిన్న చిన్న ప్రత్యేక ప్యానెల్స్‌ను రాకెట్లలో చాలా తక్కువ స్థలంలో అమర్చి సులభంగా చంద్రుడు లేదా అంగారక గ్రహంపైకి చేర్చవచ్చు.

అనంతరం ఈ ప్యానెల్స్‌ను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ వ్యోమగాములు తమకు కావాల్సిన గదులుగా మార్చుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్‌ను ఐఐఎస్‌సీ పరిశోధకులు మృత్యుంజయ్ బారువా, అమోఘ్ జాదవ్, బిమలేందు మహాపాత్రతో పాటు గగన్‌యాన్ వ్యోమగామి శుభాన్షు శుక్లా సంయుక్తంగా రూపొందించారు. దీనిపై శుక్లా ఓ పవర్ పాయింట్ ప్రజంటేషన్ సైతం ఇచ్చారు.
ఈ అత్యాధునిక డిజైన్ స్పేస్‌ఎక్స్ కు చెందిన భారీ స్టార్‌షిప్ రాకెట్ పేలోడ్ లకు అనుగుణంగా తయారు చేశారు. ఈ ప్యానెల్స్‌ను రాకెట్ లో తరలించడం సులభతరమౌతుందని, చాలా తక్కువ స్థలాన్ని వాడుకునేలా పేర్చి అమర్చవచ్చని శుక్లా వివరించారు. ఈ ప్యానెల్స్ సహాయంతో సిద్ధం చేసే భీమ్ మోడల్ తరహా నివాసం.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ స్థలాన్ని వ్యోమగాములకు కల్పిస్తుందని అంచనా వేసినట్లు వివరించారు.
వ్యోమగాములు సుదీర్ఘ అంతరిక్ష యాత్రల సమయంలో చంద్రునిపై లేదా అంగారకుడిపై తమ పరిశోధనలు, రోజువారీ కార్యకలాపాలు సాగించడానికి ఎంత స్థలం అవసరమవుతుందనే విషయంపై విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ డిజైన్‌ను ఖరారు చేసినట్లు తెలిపారు. భీమ్.. ప్యానెల్ బేస్డ్ నిర్మాణ శైలి కావడం వల్ల దీని నిర్వహణ వ్యోమగాములకు అత్యంత సులభతరమౌతుందని, ఆ షెల్టర్ లో ఏదైనా ఓ భాగం దెబ్బతింటే, మొత్తం నిర్మాణ వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేకుండా, ఆ ఒక్క ప్యానెల్‌ను మాత్రమే సులభంగా మార్చుకోవచ్చని వివరించారు.
భూమికి సుదూరంగా ఉండే గ్రహాలపై సురక్షితంగా జీవించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఇది ప్రాథమిక డిజైన్ దశలోనే ఉన్నప్పటికీ.. భవిష్యత్ మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల్లో ఇది కీలక మలుపు కానుంది. అంతరిక్షంలోని ప్రాణాంతక రేడియేషన్ నుంచి రక్షణ పొందడం, అధునాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, చంద్రుడి వాతావరణానికి తట్టుకునేలా పదార్థాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.
అంతర్జాతీయ స్పేస్ ఏజెన్సీలు సైతం ఇప్పటికే ఇలాంటి సామర్థ్యం గల హాబిటాట్ నమూనాలపై ప్రయోగాలు కొనసాగిస్తోన్నాయి. భారత్ కూడా తన సొంత సాంకేతికతో రూపొందించిన ఈ భీమ్ మోడల్ ద్వారా అంతరిక్ష నివాసాల రేసులో నిలిచినట్టయింది. చంద్రుడు లేదా అంగారక గ్రహం వంటి సుదూర లోకాల్లో జీవించడం అనేది ఊహించినంత సులభం కాదు. అక్కడ అత్యంత హానికరమైన స్పేస్ రేడియేషన్, అసాధారణమైన ఉష్ణోగ్రత, అదే స్థాయిలో చలి వంటి వాతావరణ మార్పులు మానవ మనుగడకు సవాల్ విసురుతుంటాయి.
వీటితో పాటు అంతరిక్ష వ్యర్థాలు ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంది. వీటన్నింటిని తట్టుకుని నిలబడేలా ఈ నివాస నమూనాను డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆయా అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్ ను రూపొందించినట్లు శుభాన్షు శుక్లా వివరించారు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ ప్రాజెక్ట్.. మున్ముందు విశ్వాంతరాళంలో మనుగడ సాగించే అంతరిక్ష నివాసాలకు ప్రాతిపదికగా మారొచ్చనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.















Click it and Unblock the Notifications