అంతరిక్షంలో అమెరికా 'చక్రవ్యూహం': చంద్రుడిపై పట్టు కోసం 'సిస్లూనార్'
భూమి కక్ష్యను దాటి.. చంద్రుడి సరిహద్దుల వరకు అమెరికా తన ఆధిపత్యాన్ని విస్తరిస్తోంది. కేవలం శాస్త్రీయ అన్వేషణకే పరిమితం కాకుండా, జాతీయ భద్రత దృష్ట్యా చంద్రుని పరిసర ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచేందుకు "యూఎస్ స్పేస్ ఫోర్స్" సరికొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తోంది. "అమెరికన్ అంతరిక్ష ఆధిపత్యాన్ని నిర్ధారించడం" అనే ట్రంప్ పరిపాలన కార్యనిర్వాహక ఉత్తర్వుల మేరకు, సిస్లూనార్ అంతరిక్షంలో అమెరికా ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఈ భారీ వ్యూహాన్ని రచించారు.
సాధారణంగా మనం భూమి చుట్టూ తిరిగే శాటిలైట్ల గురించి వింటుంటాం. కానీ 'సిస్లూనార్' అంటే భూమి నుండి చంద్రుని వరకు ఉండే విస్తారమైన అంతరిక్ష ప్రాంతం. ఇప్పటివరకు ఇది కేవలం పరిశోధనలకే పరిమితమని భావించినా, భవిష్యత్తులో చంద్రునిపై స్థావరాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకంగా మారింది. "అమెరికా ప్రయోజనాలు ఎక్కడికి వెళితే, అక్కడికే స్పేస్ ఫోర్స్ వెళ్తుంది" అని చీఫ్ ఆఫ్ స్పేస్ ఆపరేషన్స్ జనరల్ ఛాన్స్ సాల్ట్జ్మాన్ స్పష్టం చేయడం అంతరిక్షంలో మారుతున్న సమీకరణాలకు అద్దం పడుతోంది.

బ్లైండ్ స్పాట్స్ లేని నిఘా..
ప్రస్తుతం అమెరికా రక్షణ వ్యవస్థలు భూమికి దగ్గరగా ఉండే వస్తువులను ట్రాక్ చేయగలవు. కానీ చంద్రుని సమీపంలోని ప్రాంతాల్లో వస్తువులను గుర్తించడం, వాటి కదలికలను నిరంతరం పర్యవేక్షించడం సవాలుతో కూడుకున్న పని. చైనా కూడా చంద్రునిపై తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్న తరుణంలో, సిస్లూనార్ ప్రాంతంలో ఎవరూ ఊహించని పథాలలో వస్తువులను పంపే అవకాశం ఉంది. ఈ 'గుడ్డి మచ్చలను' తొలగించి, రవాణా, కమ్యూనికేషన్ - నావిగేషన్ వ్యవస్థలను సురక్షితంగా ఉంచడమే కొత్తగా ఏర్పడే సేకరణ కార్యాలయం ప్రధాన విధి.
నాసాతో దోస్తీ.. అంతరిక్షంలో భద్రత..
ఈ భారీ ప్రాజెక్టులో నాసా (NASA) అతిపెద్ద భాగస్వామిగా ఉండబోతోంది. నాసా చేపట్టే ఆర్టెమిస్ మిషన్ల ద్వారా చంద్రునిపైకి వెళ్లే వ్యోమగాములకు మరియు అక్కడ నిర్మించే స్థావరాలకు స్పేస్ ఫోర్స్ రక్షణ కవచంలా నిలవనుంది. అనుభవజ్ఞురాలైన సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ జామీ స్టియర్న్స్ ఈ కార్యాలయానికి నాయకత్వం వహించనున్నారు. కేవలం సైనిక ఉనికి మాత్రమే కాకుండా, అంతరిక్షంలో అమెరికా కార్యకలాపాలు ఎటువంటి ఆటంకం లేకుండా సాగడానికి అవసరమైన సాంకేతికతను ఈ విభాగం అభివృద్ధి చేయనుంది.
మొత్తానికి, చంద్రునిపై అడుగు పెట్టడమే కాదు, ఆ పరిసర ప్రాంతాలను తమ అదుపులో ఉంచుకోవడం ద్వారా అంతరిక్షంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని అమెరికా భావిస్తోంది














Click it and Unblock the Notifications