టెస్లా మ్యాజిక్ ఫెయిల్: భారత్‌లో ఎందుకు పనిచేయలేదు?
అమెరికా, చైనా సహా ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిన తర్వాత ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లా భారత్‌లోకి అడుగుపెట్టింది. టెస్లా ఇండియన్ మార్కెట్లో కూడా సంచలనం సృష్టిస్తుందని ఆ సంస్థ భావించింది. కానీ అది సాధ్యం కాలేదు. టెస్లా జులై నెలలో తమ మొదటి కారు మోడల్ వైని ఘనంగా ప్రారంభించింది. తర్వాత ముంబై, ఢిల్లీలలో షోరూంలను కూడా ప్రారంభించింది. మోడల్ వై భారీ అమ్మకాలను నమోదు చేస్తుందని కంపెనీ ఆశించింది. కానీ ఇప్పటివరకు కేవలం 600 బుకింగ్‌లు మాత్రమే వచ్చాయి. ఈ సంవత్సరం చివరి నాటికి 2,500 కార్లను విక్రయించాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఈ సంఖ్య ఆశించిన దానికంటే చాలా తక్కువగా ఉంది.
అధిక ధరలే ప్రధాన కారణం
టెస్లా కార్ల తక్కువ బుకింగ్ లకు ప్రధాన కారణం వాటి అధిక ధరలు. మోడల్ వై ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్‌ను రూ.60 లక్షలకు, లాంగ్ రేంజ్ ఆర్‌డబ్ల్యూడీని రూ.67 లక్షలకు ప్రారంభించడం కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. చైనా, అమెరికా వంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో మోడల్ వై ధర దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంది. ఈ ధర వ్యత్యాసం కారణంగానే భారతీయ మార్కెట్‌లో తన మాయాజాలాన్ని చూపించలేకపోయింది.

భారత్‌లో అధిక ధర ఎందుకు?
టెస్లా భారతదేశంలో కార్లను తయారు చేయడం లేదు. బదులుగా చైనాలోని షాంఘై ప్లాంట్ నుంచి వాటిని దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది. దీనివల్ల దిగుమతి పన్నులు అధికంగా ఉంటాయి. ఫలితంగా కారు ధర విపరీతంగా పెరిగిపోతుంది. ఒకవేళ టెస్లా భారత్‌లోనే తన కార్లను తయారు చేసి ఉంటే, ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉండేది.
త్వరలో డెలివరీలు ప్రారంభం
నివేదిక ప్రకారం.. టెస్లా 2025లో భారతదేశానికి 350 నుంచి 500 కార్లను పంపించడానికి ప్రణాళికలు వేస్తోంది. మొదటి బ్యాచ్‌ను సెప్టెంబర్ ప్రారంభంలో షాంఘై ప్లాంట్ నుంచి పంపనుంది. ఈ కార్ల డెలివరీలు మొదట ముంబై, ఢిల్లీ, పుణె, గురుగ్రామ్‌లోని కస్టమర్లకు ఇవ్వబడతాయి. ఇదిలా ఉండగా.. టెస్లా ఇండియాలో తమ వ్యూహాన్ని మార్చుకోకపోతే.. ఈ మార్కెట్ లో విజయం సాధించడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications