టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ షాక్-ఇకపై ఫ్యామిలీతో కష్టమే..!
ఇతర దేశాలతో పోలిస్తే భారత జట్టు క్రికెటర్లు ఎక్కడికి వెళ్లినా కుటుంబాలతో కలిసి వెళ్లడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా విదేశీ టూర్లకు అయితే కుటుంబాలతోనే కలిసి వెళ్తున్నారు. మ్యాచ్ జరిగే సమయాల్లోనూ గ్యాలరీల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. వారి సమక్షంలో ఆటగాళ్లు పూర్తిగా మ్యాచ్ పై ఫోకస్ కూడా పెట్టడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై క్రికెటర్లు టూర్లకు వెళ్లినప్పుడు వారి కుటుంబాలతో గడిపే సమయాన్ని తగ్గించాలని బీసీసీఐ నిర్ణయించింది. అలాగే ఆటగాళ్లు మ్యాచ్ ప్రాక్టీస్ కు వెళ్లేటప్పుడు, మ్యాచ్ లకు వెళ్లేటప్పుడు మిగతా ఆటగాళ్లతో కాకుండా వ్యక్తిగతంగా వాహనాల్లో రావడాన్ని కూడా నిషేధించబోతోంది. 45 రోజులు అంతకంటే ఎక్కువ టూర్ సమయం ఉన్నప్పుడు ఆటగాళ్ల భార్య, పిల్లల్ని మాత్రమే వారితో అనుమతించాలని భావిస్తోంది. అదీ కేవలం 14 రోజుల పాటే వారిని అనుమతించనుంది. అదే చిన్న టూర్లయితే వారం పాటే అనుమతిస్తారు.

వాస్తవానికి క్రికెటర్ల కాంట్రాక్టు నిబంధనల్లోనే ఈ రూల్స్ ఉన్నప్పటికీ కోవిడ్ నుంచి వీటిలో మినహాయింపు ఇస్తూ వస్తున్నారు. ఆస్ట్రేలియా టూర్ లో వైఫల్యాల తర్వాత ముంబైలో బీసీసీఐ ఆఫీస్ బేరర్లతో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్, ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గతంలో అమలు చేసిన నిబంధనలకే తిరిగి వెళ్లాలని నిర్ణయించారు. టీమ్ తో బస్సులో ఉండే ప్రతీ ఆటగాడికీ ఈ నిబంధనలు వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే కుటుంబాలకు వసతి మాత్రమే ఇవ్వాలని, ప్రయాణ ఖర్చులు ఇవ్వకూడదని కూడా భావిస్తున్నారు. త్వరలో దీనిపై అధికారిక ఆదేశాలు ఇస్తారు.












Click it and Unblock the Notifications