నక్కతోక తొక్కాడు పో..!!
బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ కు తీపికబురు అందనుంది. మరికొంతకాలం పాటు ఆయన చీఫ్ సెలెక్టర్ గా కొనసాగబోతోన్నాడు. ఈ ఏడాది జూన్‌లో ప్రస్తుత పదవీకాలం ముగియాల్సి ఉండగా.. దీన్ని పొడిగించాలని బీసీసీఐ తాజాగా నిర్ణయించింది. 2027 జూన్ వరకు అంటే మరో ఏడాది పాటు అదే హోదాలో కొనసాగనున్నారు. రాబోయే ముఖ్యమైన టోర్నమెంట్లను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
టీమిండియా అద్భుత విజయాలను సాధిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సెలెక్షన్ కమిటీలో ఎటువంటి మార్పులు చేయకూడదని భావిస్తోంది. అగార్కర్ నాయకత్వంలో టీమిండియా ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా అవతరించింది. ఆయన హయాంలో మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకోవడం దీనికి నిదర్శనం. అగార్కర్ పదవీకాలంలో టీమ్ లో మార్పులు సజావుగా జరిగాయనే నిర్ణయానికి వచ్చింది. ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు జట్టుకు కలిసొచ్చాయని, అందుకే ఆయన కొనసాగాలని బోర్డు భావిస్తోందని బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఓ కథనాన్ని ప్రచురించింది.

సెలక్షన్ ప్యానెల్‌లో ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓఝా వంటి సభ్యులు ఇంకా ఏడాది పూర్తి చేసుకోని నేపథ్యంలో, అగార్కర్‌ను కొనసాగించడం వల్ల ఎంపిక ప్రక్రియలో స్థిరత్వం లభిస్తుందని బోర్డు విశ్వసిస్తోంది. అగార్కర్ నేతృత్వంలో భారత్ సుదీర్ఘ ఐసీసీ టైటిల్ కరవును తీర్చింది. 2024, 2026 లలో వరుసగా టీ20 ప్రపంచ కప్‌లుతో పాటు గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. 2023లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు కూడా చేరింది.
వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న మరో వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో ఎంపిక నాయకత్వంలో స్థిరత్వం చాలా కీలకమని బోర్డు భావిస్తోంది. అజిత్ అగార్కర్ పదవీకాలం భారత క్రికెట్‌లో ఒక కీలక దశకు వేదికైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి గొప్ప ఆటగాళ్ళు టెస్ట్ క్రికెట్ నుండి నిష్క్రమించారు. అదే సమయంలో టెస్టుల్లో శుభ్‌మన్ గిల్, టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ వంటి కొత్త నాయకులు జట్టు పగ్గాలు చేపట్టారు. ఈ సమయాల్లో ఎంపిక కమిటీ అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడలేదు.












Click it and Unblock the Notifications