Ind vs Pak : భారత్-పాక్ మ్యాచ్-అభిమానులకు గుడ్ న్యూస్-కాసేపట్లో ఫుల్ మ్యాచ్..
శ్రీలంకలో జరుగుతున్న ఆసియాకప్ సూపర్ 4 పోటీల్లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ కాసేపట్లో ప్రారంభమవుతోంది. ఇప్పటికే వర్షం కారణంగా నిన్న సగం మ్యాచ్ కూడా పూర్తి కాకుండానే నిలిచిపోయింది. అలాగే ఇవాళ కూడా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే వర్షం కురవకపోవడం, తడి ఔట్ ఫీల్డ్ ను ఆరబెట్టడంతో మ్యాచ్ 4.40 నిమిషాలకు ప్రారంభమవుతోంది.
ఆసియాకప్ సూపర్ 4 పోరులో భాగంగా నిన్న టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ శుభారంభం అందించారు. ఇద్దరూ పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ అర్ధసెంచరీలు సాధించారు. అయితే తొలివికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు అవుటయ్యారు. దీంతో భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. వీరి స్ధానాల్లోకి వచ్చిన విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు. నిన్న వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 147 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.

ఇవాళ అక్కడి నుంచే తిరిగి ఆట ప్రారంభం కానుంది. అయితే ఇవాళ తడి ఔట్ ఫీల్డ్ కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యమైనా ఫుల్ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఇరుజట్లూ 50 ఓవర్ల చొప్పున ఆడనున్నాయి. ఇప్పటికే భారత్ 24.1 ఓవర్లు ఆడటంతో మిగిలిన 25.5 ఓవర్లు బ్యాటింగ్ చేయనుంది. ఆ తర్వాత పాకిస్తాన్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంది. వర్షం మరోసారి ఇబ్బంది పెడితే మాత్రం ఇందులో మార్పులు ఉంటాయి.
బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న ప్రేమదాస స్టేడియంలో గతేడాది నుంచి చూస్తే తొలి బ్యాటింగ్ చేసిన జట్టు 3 సార్లు, రెండు బ్యాటింగ్ చేసిన జట్టు 2 సార్లు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత్ భారీ స్కోరు చేయగలిగితే పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ పై ఎప్పుడూ చెలరేగిపోయే విరాట్ కొహ్లీ నుంచి అభిమానులు మరో భారీ ఇన్నింగ్స్ ఊహిస్తున్నారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications