నఖ్వీ ఉద్వాసనకు పావులు కదిపిన బీసీసీఐ..: ఎట్టకేలకు కదలిన ఆసియా కప్ ట్రోఫీ
ఆసియా కప్ 2025 ఫైనల్ తర్వాత ట్రోఫీ ప్రదానం విషయంలో నెలకొన్న వివాదానికి తెరపడినట్టే కనిపిస్తోంది. ట్రోఫీని భారత్ కు అందించే విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ ఎట్టకేలకు మెత్తబడ్డారు. ఈ ట్రోఫీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు అందజేయడానికి అంగీకరించారు. ఎటువంటి షరతులు లేకుండా దీన్ని అందజేయడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
ట్రోఫీని నఖ్వీ తన వెంట తీసుకెళ్లిపోయిన నేపథ్యంలో దీన్ని తిరిగి తెప్పించుకోవడానికి బీసీసీఐ చేపట్టిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. ఏసీసీని స్వయంగా సంప్రదించనప్పటికీ.. దాన్ని తెచ్చుకోవడానికి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ద్వారా సంప్రదింపులు జరుపుతోంది. ట్రోఫీని భారత్ కు పంపించాలని ఆ క్రికెట్ బోర్డు వైస్ ఛైర్మన్ ద్వారా ఆదేశించింది బీసీసీఐ. ఈ అభ్యర్థనను నఖ్వీ మొదట నిర్ద్వంద్వందంగా తిరస్కరించినప్పటికీ.. ఆ తర్వాత ఓకే చెప్పినట్లు వార్తలొచ్చాయి.

ప్రస్తుతం ఈ ట్రోఫీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆధీనంలో ఉందని, త్వరలోనే దీన్ని బీసీసీఐకి అప్పగించే అవకాశం ఉందని సీఎన్ఎన్- న్యూస్ 18 తెలిపింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. బీసీసీఐ విశ్వసనీయ వర్గాలను తన కథనానికి ఉటంకించింది. ఆసియా కప్ ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్‌లోని ఆసియా క్రికెట్ కౌన్సిల్ రీజినల్ ఆఫీస్ లో ఉందని, దీన్ని ఎమిరేట్స్ బోర్డ్ తన ఆధీనంలోకి తీసుకుంది. త్వరలోనే బీసీసీఐకి చేతికి అందుతుందని సీఎన్ఎన్ తెలిపింది.
కిందటినెల 28వ తేదీన దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్‌ను ఓడించి కప్‌ను గెలుచుకుంది టీమిండియా. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించింది. దీంతో ట్రోఫీని ఆయన వెంట పట్టుకెళ్లిపోయారు. ఇన్నాళ్లూ ఆయన బస చేసిన హోటల్ లో దీన్ని ఉంచారు. ఇప్పుడు తాజాగా ఈ ట్రోఫీ ఏసీసీ రీజినల్ ఆఫీస్ కు చేరిందని, ఎమిరేట్స్ బోర్డు స్వాధీనం చేసుకుందని వార్తలు వచ్చాయి.
మొహ్సిన్ నఖ్వీపై తీవ్ర వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో ఆయన మెత్తబడ్డారని చెబుతున్నారు. స్వదేశంలోనూ పలువురు మాజీ క్రికెటర్లు ఘాటుగా విమర్శలు గుప్పించడంతో చేసేదేమీ లేక వెనక్కి తగ్గారని అంటున్నారు. ఏసీసీ అధ్యక్ష పదవి నుండి నఖ్వీకి ఉద్వాసన పలకాలనే కూడా వినిపించింది. ఈ మేరకు బీసీసీఐ పావులు కదిపిందని, ఈ సమాచారం అందిన తర్వాతే నఖ్వీ పట్టువీడినట్లు చెబుతున్నారు. కాగా- ఆసియా కప్ ట్రోఫీ బీసీసీఐకి పంపిస్తారా? లేక.. అక్కడే ఉన్న బోర్డు వైస్ ఛైర్మన్ రాజీవ్ శుక్లాకు అప్పగిస్తారా? అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications