T20 World Cup 2026: వరల్డ్ కప్ పై తేల్చేసిన బంగ్లాదేశ్..! కీలక నిర్ణయం..!
వచ్చే నెల 7వ తేదీన భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభమవుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఆడే విషయంలో బంగ్లాదేశ్ ఇవాళ తేల్చేసింది. భారత్ లో టీ20 మ్యాచ్ లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తూ వస్తోంది. దీంతో ఐసీసీ కూడా అంతే పట్టుదలగా బంగ్లాదేశ్ ఆడకపోతే మరో జట్టును ఎంపిక చేసి టోర్నీలో అవకాశం కల్పిస్తామని చెప్పేస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లా ప్రభుత్వ ప్రతినిధితో భేటీ అయిన క్రికెట్ బోర్డు అధికారులు తుది నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తమ జట్టును భారతదేశానికి పంపకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) నిర్ణయించింది. జాతీయ జట్టు క్రికెటర్లు, తాత్కాలిక ప్రభుత్వ క్రీడా సలహాదారుతో జరిగిన కీలకమైన సమావేశం తరువాత, బంగ్లాదేశ్ ప్రపంచ టోర్నమెంట్‌ను బహిష్కరించినప్పటికీ, తమ వైఖరిపై పట్టువీడరాదని నిర్ణయించింది. ఐసిసి బంగ్లాదేశ్‌తో న్యాయంగా వ్యవహరించడంలో విఫలమైందని క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ సమావేశం తర్వాత ఆరోపించారు.

ఐసీసీ తమకు న్యాయం చేయలేదని, ప్రస్తుత సమస్య క్రికెట్ సంప్రదాయాలకు మించి ఉందని ఆయన తెలిపారు. తాము తలవంచమని, బంగ్లాదేశ్ ప్రపంచ కప్ ఆడకపోతే దాని అర్థం ఏమిటో అందరూ అర్థం చేసుకోవాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆటగాళ్ల భద్రతను నిర్లక్ష్యం చేయలేమని ఆయన తేల్చిచెప్పేశారు. మరోవైపు టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారు అయినందున, భారత్ బయట వేదికలకు బంగ్లా ఆడే మ్యాచ్ లను మార్చే అవకాసం లేదని ఐసీసీ ఇప్పటికే తేల్చేసింది. ఈ మేరకు 24 గంటల్లో తమ నిర్ణయం చెప్పాలని ఐసీసీ నిన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు అల్టిమేటం ఇచ్చింది.

దీంతో ఇవాళ భారత్ లో మ్యాచ్ లు ఆడకూడదని బీసీబీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ తీసుకోబోయే నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ ను బాయ్ కాట్ చేస్తే ఆ స్ధానంలో ఈ టోర్నీకి అర్హత సాధించని స్కాట్లాండ్ కు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. దీనిపై ఐసీసీ కూడా వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications