IPL 2026: ఈసారి ఐపీఎల్ లో బంగ్లా ప్లేయర్లు బ్యాన్ ? తేల్చేసిన బీసీసీఐ..!
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు సమయం దగ్గరపడుతోంది. మార్చి నెలాఖరులో ఐపీఎల్ 2026 ప్రారంభం కాబోతోంది. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయ. దీంతో ఈసారి ఐపీఎల్ లో బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఆడకుండా నిషేధం విధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇవాళ స్పందించింది. ఐపీఎల్ లో బంగ్లాదేశ్ ఆటగాళ్లపై నిషేధం విధించే విషయంలో ఉన్న పరిస్ధితిని చెప్పేసింది.
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ తరహాలోనే ఆ దేశ ఆటగాళ్లను కూడా ఐపీఎల్ లో ఆడకుండా నిషేధించాలనే డిమాండ్లు దేశంలో వినిపిస్తున్నాయి. కానీ తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో పాటు పలు ఫ్రాంచైజీలు బంగ్లాదేశ్ ఆటగాళ్లను తమ జట్లలోకి తీసుకున్నాయి. దీంతో వీరు ఈసారి ఐపీఎల్ ఆడేందుకు సిద్దమవుతున్నారు. అయితే వీరిని అడ్డుకోవాలని, లేకపోతే మొత్తం ఐపీఎల్ ను అడ్డుకుంటామని హిందూ సంఘాలు, శివసేన వంటి రాజకీయ పార్టీలు హెచ్చరిస్తున్నాయి.

దీంతో బీసీసీఐ ఇరుకునపడింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం వేలంలో తీసుకున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఇప్పుడు హఠాత్తుగా తొలగిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్రంతో చర్చలు జరుపుతున్న బీసీసీఐ.. ఇవాళ ఈ డిమాండ్లపై క్లారిటీ ఇచ్చింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్ లో ఆడకుండా అడ్డుకునే విషయంపై తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు కానీ, మార్గదర్శకాలు కానీ లేవని తేల్చిచెప్పేసింది. దీనిపై ఇంతకు మించి మాట్లాడేందుకు కూడా ఏమీ లేదని బోర్డు వర్గాలు తెలిపాయి. దీంతో తమ కోర్టులో ఉన్న బంతిని కాస్తే కేంద్రం కోర్టులోకి నెట్టేసింది.

అయితే త్వరలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉండటంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు బంగ్లా ప్లేయర్లను నిషేధిస్తే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దౌత్య సంబంధాలకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉండటంతో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆలోపు బీసీసీఐపై రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications