అందుకే గిల్ ను తప్పించాం..
టీ20 వరల్డ్ కప్ ఆడబోయే భారత జట్టులో శుభ్‌మన్ గిల్ కు చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీలో 15 మంది సభ్యుల జట్టులో అతనికి స్థానం దక్కలేదు. టీ20 ఫార్మట్ లో వైస్ కేప్టెన్‌గా అతనికి ఇటీవలే పదోన్నతి లభించినప్పటికీ ఇప్పుడు ఏకంగా జట్టులో చోటు కోల్పోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పేలవమైన ప్రదర్శన కారణంగా బీసీసీఐ అతన్ని టీ20 ఇంటర్నేషనల్స్ నుండి తొలగించింది.
అతన్ని తీసుకోకపోవడానికి గల కారణాలను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. టెస్టులు, వన్డేలలో అద్భుతంగా రాణించినా టీ20ల్లో నిలకడను కోల్పోయాడని వ్యాఖ్యానించారు. అదే సమయంలో జట్టుకు ఇద్దరు వికెట్ కీపర్లు (సంజు శాంసన్, ఇషాన్ కిషన్) అవసరం ఏర్పడిందని, ఫలితంగా కూర్పుపై ఎటువంటి ప్రభావం పడకూడదని భావించామని అగార్కర్ పేర్కొన్నారు.

గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ కూడా జట్టు కూర్పులో భాగంగానే అతడిని తప్పించాల్సి వచ్చిందని అగార్కర్ స్పష్టం చేశారు. శుభ్‌మన్ ఎంత నాణ్యమైన ఆటగాడేనని, ప్రస్తుతానికి టీ20ల్లో కొంత వెనుకపడ్డాడని వ్యాఖ్యానించారు. ఇద్దరు వికెట్ కీపర్లను జట్టులో తీసుకోవాలనే ఆలోచన కూడా అతనిపై వేటు వేయడానికి ఓ కారణమైందని వివరించారు. టాప్ ఆర్డర్‌లో ఇద్దరు వికెట్ కీపర్లనే ఆడించాలని నిర్ణయించుకున్నామని, ఇదే తమ విధానమని అగార్కర్ స్పష్టం చేశారు.
రింకూ సింగ్ చేరిక మిడిల్, లోయర్ ఆర్డర్ ను మరింత బలోపేతం చేస్తుందని అగార్కర్ పేర్కొన్నారు. 15 మందిని ఎంపిక చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు తప్పుకోవాల్సి వస్తుందని, దురదృష్టవశాత్తు గిల్ దాన్ని ఎదుర్కొనాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఆటగాళ్ల ఎంపికపై భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చని అగార్కర్ అంగీకరించారు. ఇప్పటికీ గిల్‌ను నాణ్యమైన ఆటగాడిగానే భావిస్తామని, ఫామ్‌లో ఒడిదుడుకులు సహజమేనని అన్నారు.
జట్టు యాజమాన్యం కోరుకుంటున్న కాంబినేషన్లు కుదరకపోవడం వల్లే గిల్ కు చోటు దక్కలేదని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. టాప్ ఆర్డర్‌లో ఇద్దరు వికెట్ కీపర్‌లను ఆడించే ప్రయత్నం చేస్తోన్నామని, ఇది జట్టుకు మరింత పటిష్టతనిస్తుందని వివరించారు. శుభ్‌మన్ గిల్ కు చోటు దక్కలేదంటే అతను మంచి బ్యాటర్ కాదనుకోవట్లేదని, కాంబినేషన్లు కుదరకపోవడం వల్ల తీసుకోలేదని పేర్కొన్నారు. కొన్నిసార్లు ఇతర ప్లేయింగ్ షెడ్యూల్‌ల కారణంగా కొందరు ప్లేయర్లు కొన్ని ఫార్మాట్లలో చోటు కోల్పోతారని ఇది పెద్ద విషయం కాదని అన్నారు.












Click it and Unblock the Notifications