తేలిపోనున్న వినేష్ ఫొగట్ భవితవ్యం
Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ వ్యవహారం.. అనూహ్య మలుపు తిరిగింది. ఈ ఉదంతం అడ్‌హక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌కు చేరింది. అనర్హత వేటుపై వాదనలను ఈ న్యాయస్థానం ఆలకించింది.
భారత ఒలింపిక్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వొకేట్, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే రంగంలోకి దిగారు. తన వాదనలను వినిపించారు. అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్లు, హై ప్రొఫైల్ కేసులను వాదించడం, వాటిని తనకు సానుకూలంగా మలచుకోవడంలో ఆరితేరిన అడ్వొకేట్ ఆయన.

వినేష్ ఫొగట్ అనర్హత విషయాన్ని భారత ఒలింపిక్స్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అడ్‌హక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో వాదించడానికి హరీష్ సాల్వేను బరిలోకి దించింది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశమైన కేసు కావడం, దీనికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని వాదించడానికి ముందుకొచ్చారాయన.
కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్..ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో కొనసాగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో క్రీడారంగంలో వివాదాలను పరిష్కరించడానికి 1984లో ఏర్పాటైన కోర్టు ఇది. ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని పారిస్‌లో తాత్కాలికంగా ఈ అడ్‌హక్ కోర్ట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడే వినేష్ ఫొగట్ కేసు వాదనలు పూర్తయ్యాయి.
తనకు రజత పతకం దక్కేలా ఆదేశాలను జారీ చేయాలంటూ వినేష్ ఫొగట్ అప్పీల్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఆమె విచారణకు హాజరయ్యారు. అడ్వొకేట్ హరీష్ సాల్వే, మరో సీనియర్ న్యాయవాది విదూష్ పత్ సింఘానియాతో కలిసి తన వాదనలను వినిపించారు.
వారి వాదనలతో పాటు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ రెజ్లింగ్, ఒలింపిక్స్ కమిటీ విధి విధానాలు, నిబంధనల పరిశీలించిన అనంతరం తుది తీర్పు ఇవ్వనుంది అడ్ హక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్. దీనిపై తుది తీర్పు మనదేశ కాలమానం ప్రకారం ఈ రాత్రి 9:30 గంటలకు వెలువడనుంది.
మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ చేరిన వినేష్ ఫొగట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను ఢీ కొట్టాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె డిస్ క్వాలిఫై అయ్యారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె అనర్హత వేటుకు గురయ్యారు.












Click it and Unblock the Notifications