సురేష్ రైనా, శిఖర్ ధావన్‌కు బిగ్ షాక్.. భారీగా క్షవరం !!
భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు బిగ్ షాక్ తగిలింది. వారి ఆస్తులు జప్తు అయ్యాయి. మొత్తం 11.14 కోట్ల రూపాయల మేర ఆస్తులు అటాచ్ అయ్యాయి. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. వారి ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆస్తులను జప్తు చేయడానికి గల కారణాలను ఇందులో వివరించింది.
సురేష్ రైనా, శిఖర్ ధావన్.. ప్రస్తుతం మనీ లాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు, వాటికి సంబంధించిన వ్యాపార ప్రకటనల్లో నటించినందుకు వాళ్లిద్దరూ ఈడీ రాడార్ లోకి వచ్చారు. 1xBet బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసు వారిపై గతంలో నమోదైంది. ఇదే అంశంపై గతంలో వీరిద్దరి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు సైతం కొనసాగించారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

1xBet మనీలాండరింగ్ కేసులో సురేష్ రైనా, శిఖర్ ధావన్ ప్రమేయం ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. బెట్టింగ్ యాప్ కు సంబంధించిన అడ్వర్టయిజ్మెంట్లల్లో నటించినందుకు, ఆ తర్వాత వాటిని ప్రమోట్ చేసినందుకు ఆయా సంస్థల నుంచి మనీలాండరింగ్ రూపంలో రెమ్యునరేషన్ పొందారని నిర్ధారించారు. ఈ విషయాన్ని అధికారికంగా ఎక్కడా పొందుపర్చకపోవడం, ఆదాయపు పన్ను చెల్లింపుల్లో ఈ రెమ్యునరేషన్ కు గురించి వివరించకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు.
తాజాగా చర్యలకు దిగారు. తొలి విడతలో సురేష్ రైనా, శిఖర్ ధావన్ కు సంబంధించి మొత్తం 11.14 కోట్ల రూపాయలను జప్తు చేశారు. వీటిని అటాచ్ చేశారు. క్రమంగా ఈ మొత్తం మరింత పెరగవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో- వీరిద్దరిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని సమాచారం. ఫెమా చట్టం ఉల్లంఘన కింద కేసులు నమోదు కావడానికి రంగం సిద్ధమౌతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications