T20 World Cup 2024: ఈసారి విజేత ఎవరో చెప్పేసిన ఐపీఎల్ దిగ్గజ ఆల్ రౌండర్ ...!
ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మెగా టోర్నీని ఎగరేసుకుపోయే జట్టు ఏదన్న దానిపై పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు తమ అంచనాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో టోర్నీకి ఆతిధ్యమిస్తున్న వెస్టిండీస్ కే చెందిన మాజీ ఆల్ రౌండర్, ఐపీఎల్ లో దిగ్గజ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న డ్వేన్ బ్రేవో కూడా తన అంచనాను వెల్లడించాడు.
ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. వీటిలో గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా జట్లు ఉన్నాయి. గ్రూప్ బీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లండ్, ఒమన్ జట్లు ఉన్నాయి. గ్రూప్ సీలో న్యూజీలాండ్, వెస్టిండీస్, ఆప్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినియా ఉన్నాయి. అలాగే చివరిదైన గ్రూప్ డీలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు ఉన్నాయి. ఇలా మొత్తం 20 జట్లు టోర్నీలో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఇందులో టీ20 వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉన్న జట్టు వెస్టిండీసే అని ఆ దేశ మాజీ ఆల్ రౌండర్, ఐపీఎల్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ప్రస్తుతం విండీస టీ20 జట్టు దుర్భేద్యంగా ఉందని, తాజాగా ఆస్ట్రేలియాను వణికించిన తమ జట్టుకు టీ20 వరల్డ్ కప్ గెలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రేవో వెల్లడించాడు. టోర్నీ ప్రారంభానికి 100 రోజులు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో బ్రేవో వెలువరించిన ఈ అంచనాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
అలాగే ఈ టోర్నీ తన ఫేవరేట్ ఆటగాడు విండీస్ కే చెందిన నికోలస్ పూరన్ అని డ్వేన్ బ్రేవో వెల్లడించాడు. దీర్ఘకాలంగా విండీస్ జట్టుకు అనేక విజయాలు అందించిన చరిత్ర పూరన్ కు ఉందని, ముఖ్యంగా స్పిన్ ను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొంటాడని బ్రేవో వెల్లడించాడు. కరీబియన్ పరిస్ధితుల్లో పూరన్ రాణిస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నాడు.












Click it and Unblock the Notifications