కొహ్లీ, రోహిత్ కెరీర్ ముగిసినట్లేనా ? గంభీర్ జవాబు ఇదే..!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ లో భారత్ ను ఆద్యంతం దురదృష్టం వెంటాడింది. ముఖ్యంగా భారీ అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ.. సిరీస్ ముగిసేనాటికి వారి టెస్టు కెరీర్లను ప్రమాదంలో పడేసుకున్నారు. దీంతో వీరిద్దరూ ఇక రిటైర్మెంట్లు ప్రకటించడమే తరువాయి అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జట్టు కోచ్ గౌతం గంభీర్ ను వీరి భవిష్యత్తుపై ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
ఆసీస్ తో టెస్టు సిరీస్ లో వైఫల్యాల తర్వాత సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మతో పాటు విరాట్ కొహ్లీకి కోచ్ గౌతం గంభీర్ తాను వారికి అండగా నిలుస్తానని చెప్తూనే కీలక నిర్ణయం మాత్రం వారిదే అన్నాడు. తద్వారా వీరిద్దరూ గౌరవంగా గుడ్ బై చెప్పేయడమే మేలనే సంకేతాలు ఇచ్చేసాడు. తాను ఏ ఆటగాడి భవిష్యత్తు గురించి మాట్లాడలేనని, అది వారి ఇష్టమని తెలిపాడు. వారికి ఇంకా ఆకలి ఉందని, అభిరుచి కూడా ఉందని, వారు కఠినమైన వ్యక్తులని గౌతీ తెలిపాడు. వీరు భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చాడు. కానీ చివరిగా వాళ్లు ఏ ప్లాన్ చేసినా భారత క్రికెట్‌కు మేలు చేసేలా ప్లాన్ చేస్తారని మనందరికీ తెలుసంటూ నగ్మగర్భంగా వ్యాఖ్యానించాడు.

చాలా మంది ఫామ్‌లో లేని బ్యాటర్‌లను మోసుకెళ్ళి జట్టు గెలవడం కష్టమని భావించినందునే ఐదో టెస్టుకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు గంభీర్ వెల్లడించాడు. డ్రెస్సింగ్ రూమ్ వివాదంపై స్పందిస్తూ.. ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరికీ తాను న్యాయంగా ఉండాలన్నారు. ఒకరిద్దరు వ్యక్తులతో మాత్రమే కాదన్నాడు. తాను ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులతో మాత్రమే న్యాయంగా ఉంటానంటే కుదరదన్నాడు. తద్వారా జట్టులో ప్రతీ ఆటగాడికీ న్యాయం చేసేందుకు ప్రయత్నించినట్లు గంభీర్ చెప్పుకొచ్చాడు.












Click it and Unblock the Notifications