హైదరాబాద్ Vs చెన్నై మ్యాచ్: అంధకారంలో ఉప్పల్ స్టేడియం, ఎందుకంటే?
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిర్లక్ష్యం కారణంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అంధకారంలోకి వెళ్లింది. రూ. 3 కోట్లకుపైగా విద్యుత్ బకాయిలు చెల్లించడంలో హెచ్‌సీఏ విఫలం కావడంతో విద్యుత్ శాఖ అధికారులు ఉప్పల్ స్టేడియానికి కరెంట్ సరఫరాను నిలిపివేశారు. దీంతో స్టేడియం పరిసరాలు చీకటి మయమయ్యాయి.
చెన్నై, హైదరాబాద్ జట్లు గురువారం ప్రాక్టీస్ చేస్తుండగా.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే, తాత్కాలికంగా జనరేటర్ ఏర్పాటు చేసి స్టేడియంలో విద్యుత్ అందించారు నిర్వాహకులు. కాగా, గత కొన్నేళ్లుగా హెచ్‌సీఏ విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో తెలంగాణ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ అధికారులు కోర్టును ఆశ్రయించారు. హెచ్‌సీఏకు చెందిన HBG2192 కనెక్షన్‌పై పెండింగ్ బిల్లుల బకాయిల కోసం రంగారెడ్డి జిల్లా కోర్టులో 2018లో కేసు వేశారు.

దీంతో డిఫాల్టర్‌గా ఉన్న హెచ్‌సీఏ పెండింగ్ బిల్లు రూ. 1.41 కోట్లతోపాటు రూ. 1.64 కోట్ల సర్ ఛార్జీ కలిపి రూ. 3.05 కోట్లు వారం రోజులలోగా చెల్లించాలని డిసెంబర్ 6న కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత కూడా పలుమార్లు నోటీసులు జారీ చేసినా.. హెచ్‌సీఏ అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే తాజాగా, గురువారం టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులు.. ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో తలపడనున్నాయి. తమ ఫేపరేట్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు ఇలా విద్యుత్ అంతరాయం కలగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే, నిర్వాహకులు ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుని మ్యాచ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications