ICC New Rule: ఐసీసీ కొత్త రూల్-వన్డేలు, టీ20ల్లో వేగం మరింత పెంచేలా..
అంతర్జాతీయంగా క్రికెట్ కు ఉన్న ఆదరణను కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు దాన్ని పెంచేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్న ఐసీసీ తాజాగా మరో రూల్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ముగిసిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఎదురైన ఓ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని వన్డేలతో పాటు టీ20ల్లో ఈ కొత్త నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల నుంచి ఇది అమల్లోకి రాబోతోంది.
తాజాగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో చాలా మ్యాచ్ ల్లో నిర్ణీత సమయంలో ఓవర్లు ముగించేందుకు పలు జట్లు ఇబ్బంది పడ్డాయి. దీంతో మ్యాచ్ సమయం చాలా వృథా అయింది. దీనికి గాను ఎన్ని పెనాల్టీలు విధిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు బౌలర్లను అప్రమత్తం చేస్తూ ఈ ఆలస్యాన్ని నివారించే లక్ష్యంతో ఐసీసీ కొత్త రూల్ తీసుకొస్తోంది. ఇందులో భాగంగా అంపైర్లకు స్టాప్ క్లాక్ ను ఇస్తారు. ఓవర్ లో బంతికీ, బంతికీ మధ్య అలాగే ఓవర్ల మధ్య ఎక్కువ సమయం వృథా కాకుండా హెచ్చరికలు చేస్తారు. అయినా ఆలస్యమైతే బౌలింగ్ టీమ్ కు పరుగుల పెనాల్టీ విధిస్తారు.

ఒక ఓవర్ ముగిసిన తర్వాత మరో ఓవర్ మొదలు కావడానికి కేవలం 60 సెకన్లు మాత్రమే ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. అంటే కేవలం ఒక్క నిమిషం లోపే మరో ఓవర్ మొదలు కావాల్సిందే. దీన్ని రెండుసార్లు దాటితే పర్వాలేదు. మూడోసారి ఉల్లంఘిస్తే మాత్రం బౌలింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ పడుతుంది. ఈ పరుగులు బ్యాటింగ్ చేసే జట్టు ఖాతాలో జమ అవుతాయి.
వాస్తవానికి గతేడాది స్లో ఓవర్ రేట్లను ఎదుర్కోవడానికి ఐసీసీ వన్డేలు, టీ 20ల్లో పరుగుల పెనాల్టీ రూల్ తెచ్చింది. దీని ప్రకారం ఫీల్డింగ్ చేసే జట్టు చివరి ఓవర్ నిర్ణీత సమయంలోపు వేయలేకపోతే 30 గజాల సర్కిల్ బయట ఓ ఫీల్డర్ ను లోపలికి తెస్తారు.
ఇప్పుడు టెన్నిస్, ఇతర ఆటల తరహాలోనే క్రికెట్లోనూ స్టాప్ క్లాక్ వాడకాన్ని తెస్తున్నారు. దీన్ని ప్రయోగాత్మకంగా వచ్చే నెల నుంచి వచ్చే ఏడాది నవంబర్ లోపు అమలు చేస్తారు. ఇందులో వచ్చే ఫలితాల ఆధారంగా దీని కొనసాగింపుపై ఐసీసీ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. తాజాగా వరల్డ్ కప్ లో శ్రీలంక బ్యాట్స్ మెన్ ఏంజెలో మ్యాథ్యూస్ టైమ్ ఔట్ నిబంధన కింద బంగ్లాదేశ్ అప్పీలు కు అవుటయ్యాడు. ఇప్పుడు బౌలర్ల విషయంలోనూ స్టాప్ వాచ్ పెనాల్టీ రూల్ తో ఐసీసీ బ్యాలెన్స్ చేసినట్లవుతోంది.












Click it and Unblock the Notifications