భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లపై ఐసీసీ కీలక నిర్ణయం-2027 వరకూ ఇదే అమలు..!
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ల నిర్వహణపై కొంతకాలంగా నెలకొన్న సస్పెన్స్ కు ఐసీసీ తెరదించింది. 2027 వరకూ భారత్-పాకిస్తాన్ లు ఎక్కడ నిర్వహించాలన్నదానిపై సుదీర్ఘంగా చర్చించిన ఐసీసీ ఇవాళ కీలక నిర్ణయాలు ప్రకటించింది. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడకూడదని నిర్ణయించిన నేపథ్యంలో ప్రతిష్టంభన తలెత్తింది. అయితే హైబ్రిడ్ మోడల్ లో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తామని పాకిస్తాన్ ముందుకొచ్చింది. దీంతో ఐసీసీ అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఏడాది జరిగే పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ ను పాకిస్తాన్ తో పాటు ఓ తటస్థ వేదికలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు ఛైర్మన్ జైషా నేతృత్వంలో ఇవాళ సమావేశమైన అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే 2027 వరకూ నిర్వహించే ఐసీసీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లన్నీ తటస్థ వేదికల్లోనే నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో 2027 వరకూ భారత్-పాకిస్తాన్ ల మధ్య జరిగే మ్యాచ్ ల వేదికపై చర్చకు ఫుల్ స్టాప్ పెట్టింది.

2024-27 మధ్య జరిగే ఐసీసీ ఈవెంట్లలో ఏ దేశం ఆతిధ్యమిచ్చే టోర్నీ అయినా అందులో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లు మాత్రం తటస్థ వేదికపైనే నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో వచ్చే ఏడాది జరిగే పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు వచ్చే ఏడాది జరగాల్సిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్, 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిచ్చే పురుషుల టీ20 వరల్డ్ కప్ వంటి ఈవెంట్లు ఉన్నాయి. వీటిలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ల వేదిక ఏదన్న సస్పెన్స్ కు అయితే ఐసీసీ తెరదించినట్లయింది.












Click it and Unblock the Notifications