icc world cup 2023: వరల్డ్ ట్రోఫీకి అవమానం-ఆసీస్ క్రికెటర్ మిచ్ మార్ష్ పై కేసు..
తాజాగా భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జగజ్జేతగా నిలిచింది. అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్లో భారత్ ను ఓడించి వరల్డ్ కప్ ట్రోఫీ కైవసం చేసుకుంది. అంతవరకూ బాగానే ఉన్నా ట్రోఫీ గెలిచిన తర్వాత దాన్ని కాళ్ల కింద పెట్టుకుని ఆసీస్ క్రికెటర్లు చీప్ గా ప్రవర్తించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ ట్రోఫీని కాళ్ల కింద పెట్టుకుని దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో దీన్ని చూసిన భారతీయులు షాకయ్యారు.
క్రికెట్ ను, వరల్డ్ కప్ ను ప్రాణంగా భావించే దేశంలో వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడమే గొప్ప అంటే దాన్ని కాళ్ల కింద పెట్టుకుని అవమానించడంతో భారతీయులు అవమానంగా భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ లోని అలీఘడ్ కు చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్త ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేశారు. దీనిపై తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. వరల్డ్ కప్ ట్రోఫీని కాళ్ల కింద పెట్టుకోవడం ద్వారా 140 కోట్ల మంది భారతీయుల్ని అవమానించిన వ్యవహారంపై ఢిల్లీ గేట్ పోలీసులు ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అలీఘడ్ కు చెందిన ఆర్టీఐ కార్యకర్త కేశవ్ పండిట్ ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ పై ఢిల్లీ గేట్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పలు అంశాలున్నాయి. మిచెల్ మార్ష్ తన చర్యతో వరల్డ్ కప్ ట్రోఫీని అవమానించడంతో పాటు 140 కోట్ల మంది భారతీయుల మనోభావాల్ని గాయపరిచినట్లు కేశవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన పోలీసులు మిచెల్ మార్ష్ పై కేసు నమోదు చేశారు. అయితే సెక్షన్లు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.
ఇప్పటికే ఈ వ్యవహారంపై టీమిండియా స్టార్ బౌలర్ షమీతో పాటు పలువురు క్రికెటర్లు, మాజీలు, క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. మిచెల్ చర్య తనను ఎంతో బాధించిందని ఈ ఫొటో బయటికి రాగానే షమీ స్పందించాడు. వరల్డ్ కప్ ట్రోఫీ కోసం ఎన్నో జట్లు పోటీ పడ్డాయని, చివరకు దాన్ని గెల్చుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ దాన్ని నెత్తి మీద పెట్టుకోవాల్సింది పోయి కాళ్ల కింద పెట్టడం ఏంటని షమీ ప్రశ్నించాడు. సోషల్ మీడియాలోని పలువురు ఇప్పటికే మెచెల్ మార్ష్ చర్యను తప్పుబట్టారు.












Click it and Unblock the Notifications