ICC world cup 2023: పేలవంగా వరల్డ్ కప్- ఖాళీ స్టాండ్లు-ఫ్రీ టికెట్లు ఇచ్చేయాలని సెహ్వాగ్ సలహా..
ఇవాళ గుజరాత్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో మొదలైన ఐసీసీ వన్డే ప్రపంచకప్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపర్చింది. భారత్ లో చాలా కాలం తర్వాత జరుగుతున్న వన్డే ప్రపంచకప్ అభిమానుల్ని ఉర్రూతలూగించేలా ప్లాన్ చేయడంలో బీసీసీఐ దారుణంగా విఫలమైంది. దీంతో న్యూజీలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ కు పేలవ స్పందన వచ్చింది. స్టేడియంలో ఖాళీ స్టాండ్లు దర్శనమిచ్చాయి. దీంతో నెటిజన్లు ఓ రేంజ్ లో నిర్వాహకుల్ని ఆడుకుంటున్నారు.
అదే సమయంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సహా పలువురు మాజీలు, సెలబ్రిటీలు సైతం ఈ టోర్నీపై పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో సెహ్వాగ్ బీసీసీఐకి ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ఈ టోర్నీలో టీమిండియా ఆడని మ్యాచ్ ల టికెట్లను ఉచితంగా పంచి పెట్టాలని సూచించాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్‌కు ఆదరణ తగ్గుతోందని, టోర్నమెంట్ సమయంలో యువకులకు మెరుగైన ప్రవేశం లభించడం వల్ల క్రీడపై వారి ఆసక్తిని పెంచవచ్చని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

వరల్డ్ కప్ లో మ్యాచ్ లన్నీ మధ్యాహ్నం ప్రారంభమవుతున్నాయి. ఆఫీస్ వేళల తర్వాత, ఎక్కువ మంది ప్రజలు వస్తుంటారు.కాబట్టి భారత్ ఆడని మ్యాచ్ ల టికెట్లను స్కూలు, కాలేజీ విద్యార్ధులకు ఉచితంగా ఇవ్వాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. 50 ఓవర్ల ఆటపై ఆసక్తి తగ్గుతోందని, ఈ విషయం యువతకు అనుభవంలోకి రావడానికి ఈ నిర్ణయం కచ్చితంగా ఉపయోగపడుతుందని సెహ్వాగ్ తెలిపాడు. ఈ మేరకు సెహ్వాగ్ ఎక్స్ లో ట్వీట్ చేశాడు.
ఇవాళ అహ్మదాబాద్‌లోని ఖాళీ స్టాండ్‌లు దర్శనమిచ్చాక వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో భారత్ ఆడని వాటికి స్పందన తక్కువగా ఉండే అవకాశం ఉందని తేలిపోయింది. దీంతో విద్యార్ధులకు ఉచిత టికెట్లు ఇస్తే కనీసం గ్రౌండ్లు అయినా నిండి కనిపిస్తాయనే వాదన వినిపిస్తోంది. మరి బీసీసీఐ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఈ దిశగా బీసీసీఐ నిర్ణయం తీసుకుంటే చాలా మ్యాచ్ లకు విద్యార్ధులకు ఉచితంగా చూసే అవకాశం లభిస్తుంది.












Click it and Unblock the Notifications