టీమిండియా మహా పతనం
IND vs AUS: మొన్నటికి మొన్న న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది భారత్. ఏకంగా 3-0 తేడాతో పరాజయాన్ని చవి చూసింది. ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. స్వదేశంలో ఈ రేంజ్‌లో టెస్ట్ సిరీస్‌ను కోల్పోతుందని ఎవ్వరూ ఊహించనే లేదు.
ఈ దారుణ ఓటమి నుంచి భారత్ ఎలాంటి గుణపాఠాలనూ నేర్చుకోలేదనేది స్పష్టమౌతోంది. ఆస్ట్రేలియాపై అంతే అధ్వాన్నంగా ఆడుతోంది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్‌లో 150 పరుగులకే కుప్పకూలింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కష్టాలు తొలి ఓవర్ నుంచే ఆరంభం అయ్యాయి. జట్టు స్కోరు అయిదు పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోర్ 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు మరో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ-5, కేఎల్ రాహుల్- 26 ఎంతోసేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు.
టీ బ్రేక్ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసిన భారత్.. ఆ తరువాత వంద పరుగులకు చాప చుట్టేసింది. చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. సరిగ్గా 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ల ధాటికి కకావికలమైంది బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం.
లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే కొద్దో, గొప్పో వాళ్ల బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఆపద్బాంధవుడిలా మారాడు. మెరుపు ఇన్నింగ్ ఆడాడు. ఆరు బుల్లెట్ల వంటి ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో 41 పరుగులు చేశాడు. ఇన్నింగ్‌లో అతనే టాప్ స్కోరర్.
వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్- 37, ధృవ్ జురెల్- 11, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్- 4, హర్షిత్ రాణా- 7, కేప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా- 8 పరుగులు చేశారు. మహ్మద్ సిరాజ్ నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో జోష్ హేజిల్‌వుడ్ చెలరేగాడు. నాలుగు వికెట్లు నేల కూల్చాడు. మిఛెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, మిఛెల్ మార్ష్ రెండేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications