ఏ స్పిన్ బౌలింగ్ తమ బలం అనుకున్నారో.. దానికే రోహిత్ సేన బలి
IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పట్టు కోల్పోయింది. దాని కథేమీ మారలేదు. వెంటవెంటనే వికెట్లను కోల్పోవడాన్ని అలవాటుగా మార్చుకున్నట్టయింది. మూడో టెస్ట్‌లోనూ కష్టాల్లో పడింది. ప్రత్యర్థిపై భారీ ఆధిక్యతను సాధించే అవకాశం ఉన్నా చేజేతులారా దాన్ని పోగొట్టుకుంది.
తొలి రోజు చివరి సెషన్‌లో 84 పరుగులకు భారత్ నాలుగు వికెట్లను కోల్పోయిన విషయం తెలిసిందే. కేప్టెన్ రోహిత్ శర్మ- 18, యశస్వి జైస్వాల్- 30, నైట్ వాచ్‌మెన్‌గా బరిలోకి దిగిన మహ్మద్ సిరాజ్- 0, విరాట్ కోహ్లీ- 4 వికెట్లను వెంటవెంటనే కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటికి వన్ డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రీజ్‌లో ఉండటం కొంత ఊరట కలిగించినట్టయింది.

అభిమానుల ఆశలను వారిద్దరూ ఏ మాత్రం కూడా నిరాశపర్చలేదు. రెండో రోజు ప్రారంభం నుంచే చెలరేగి ఆడారు. ధాటిగా బ్యాటింగ్ చేశారు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపారు. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ఇద్దరూ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు.
శుభ్‌మన్ గిల్- 65, రిషభ్ పంత్ 60 పరుగులు చేశారు. 60 పరుగుల చేసిన తరువాత రిషభ్ పంత్ అవుట్ అయ్యాడు. ఈష్ సోధి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సోధి సంధించిన లెగ్ బ్రేక్ డెలివరీని అడ్డుకోవడంలో తికమక పడ్డాడు రిషభ్ పంత్. బ్యాట్‌ను అడ్డు పెట్టే ప్రయత్నం చేశాడు గానీ సక్సెస్ కాలేదు. బ్యాట్‌ను తప్పించుకుని ప్యాడ్స్‌ను తాకిందా బంతి.
దీనితో ఈష్ సోధి, వికెట్ కీపర్ టిమ్ బ్లండెల్ ఎల్బీడబ్ల్యూ కోసం బిగ్ అప్పీల్ చేయడం, అంపైర్ వేలు పైకెత్తడం చకచకా సాగిపోయాయి. రిషభ్ పంత్ రివ్యూ కోరినప్పటికీ ఫలితం దక్కలేదు. బ్యాట్‌ను తాకకుండా బంతి దూసుకెళ్లడం రీప్లేలో స్పష్టంగా కనిపించింది. దీనితో 180 పరుగుల వద్ద అయిదో వికెట్‌ను కోల్పోయింది భారత్.
ఆ తరువాత వరుసబెట్టి వికెట్లు నేలకూలాయి. 83 పరుగుల తేడాతో చివరి అయిదు వికెట్లను కోల్పోయింది టీమిండియా. శుభ్‌మన్ గిల్- 90, రవీంద్ర జడేజా- 14, సర్ఫరాజ్ ఖాన్- 0, ఆకాష్ దీప్- 0, రవిచంద్రన్ అశ్విన్- 6 పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా న్యూజిలాండ్‌పై 28 పరుగుల స్వల్ప ఆధిక్యతను సాధించింది భారత్.
న్యూజిలాండ్ బౌలర్లల్లో ఎజాజ్ పటేల్ రెచ్చిపోయాడు. అయిదు వికెట్లు పడగొట్టాడీ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థొడాక్స్ బౌలర్. అతని బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో పూర్తిగా చేతులెత్తేశారు భారత బ్యాటర్లు. గిల్, సిరాజ్, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్ వికెట్లను పడగొట్టాడు.












Click it and Unblock the Notifications