India-Pak Match: భారత్-పాక్ మ్యాచ్ కు భారీ క్రేజ్..! లక్ష పెట్టాల్సిందేనా..!
మరో నాలుగు రోజుల్లో శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ భారత్-పాక్ మ్యాచ్ (india-pak match)కు క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. నిన్న మొన్నటివరకూ ఈ మ్యాచ్ జరుగుతుందో, లేదో అన్న ఉత్కంఠతో అభిమానులు టికెట్లు కొనాలంటేనే జంకారు. కానీ తాజాగా ఐసీసీ జోక్యంతో పాక్ దిగొచ్చింది. దీంతో యథావిథిగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో హడావిడిగా ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఇప్పుడు కొలంబోకు పరుగులు తీస్తున్నారు.
భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్ (India-pak match)
గతంలో భారత్-పాక్ మ్యాచ్ లకు భారీ క్రేజ్ ఉండేది. మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చేవారు. అలాగే ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ మ్యాచ్ చూసేందుకు టీవీలకు అతుక్కుపోయేవారు. కొన్ని ఆఫీసులు సెలవులు కూడా ఇచ్చేసేవి. కానీ గత కొన్నేళ్లుగా అనూహ్యంగా భారత్-పాక్ మ్యాచ్ ల సంఖ్య తగ్గిపోవడం, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అడపాదడపా జరుగుతున్న మ్యాచ్ లకు కూడా గతంతో పోలిస్తే ఆదరణ లేకపోవడం జరుగుతోంది. కానీ ఈసారి మాత్రం మారిన పరిస్ధితుల్లో ఒక్కసారిగా భారత్-పాక్ మ్యాచ్ కు క్రేజ్ పెరిగింది.

బెట్టు చేసి దిగొచ్చిన పాక్
ఈ నేపథ్యంలో టీ20వరల్డ్ కప్ ఆడతాం కానీ, భారత్ తో మ్యాచ్ ఆడబోమని కాసేపు గిల్లికజ్జాలు పెట్టుకున్న పాకిస్తాన్ కూడా ఐసీసీ జోక్యంతో వెనక్కి తగ్గింది. దీంతో ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచ్ చూసేందుకు భారత్ లోని వివిధ నగరాల నుంచి కొలంబోకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ లైన్స్ ఛార్జీలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ముంబై, ఢిల్లీ నుంచి కొలంబోకు ఇప్పుడు విమాన టికెట్ ధర ఏకంగా లక్షకు చేరింది.

ఆకాశానికి విమాన ఛార్జీలు
సాధారణంగా ఢిల్లీ నుండి కొలంబో ప్రయాణానికి సాధారణంగా రూ.30,000 ఖర్చవుతుంది, ఇప్పుడు ఇది కాస్తా రూ.90వేలు దాటిపోతోంది. అలాగే బిజినెస్ క్లాస్ విమాన ఛార్జీలు దాదాపు 2 లక్షలకు చేరిపోయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుండి శ్రీలంక ఎయిర్‌లైన్స్‌లో వన్-వే ఎకానమీ సీటుకు నాన్-స్టాప్ విమానం ఇప్పుడు 65 వేల నుంచి లక్షా 45వేలు టికెట్ పలుకుతోంది. అలాగే ముంబై నుండి కొలంబోకు 3 గంటల ప్రయాణ టికెట్ కు ఫిబ్రవరి 15న 40 వేల వరకూ ఖర్చవుతోంది. ఈ ఛార్జీల మోత వచ్చే రెండు, మూడు రోజుల్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications