IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కు డబుల్ స్ట్రోక్- ఒకేసారి ఇద్దరు ఆసీస్ స్టార్లు అవుట్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో వరుస ఓటములతో సతమతం అవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఒకేసారి రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. గాయాలతో బాధపడుతున్న ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒకేసారి జట్టుకు దూరమయ్యారు. వీరిలో ఒకరు ఏకంగా స్వదేశానికి వెళ్లిపోగా.. మరొకరి పరిస్ధితి తేలాల్సి ఉంది. దీంతో వీరిపై భారీ ఆశలు పెట్టుకున్న ఢిల్లీ జట్టుకు చుక్కలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈసారి ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్ లు ఆడి కేవలం 2 విజయాలు అందుకుంది. మరో నాలుగు మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ రాణిస్తుండగా.. మిగతా ప్లేయర్ల నుంచి అతనికి సహకారం కరువవుతోంది. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఇద్దరూ గాయపడ్డారు.

మిచెల్ మార్ష్ హ్యామ్ స్ట్రింగ్ గాయంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. గాయంతో బాధపడుతున్న మిచెల్ మార్ష్ విషయంపై బీసీసీఐతో మాట్లాడిన క్రికెట్ ఆస్ట్రేలియా అతన్ని స్వదేశానికి పిలిపించింది. దీంతో వాంఖడే స్టేడియంలో ముంబైతో మ్యాచ్ ముగియగానే అతను ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. అదే సమయంలో డేవిడ్ వార్నర్ చేతి వేలికి లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో గాయమైంది. దీంతో అతనికి స్కానింగ్ చేయిస్తున్నారు. ఈ రిపోర్టులు వచ్చాకే వార్నర్ వ్యవహారం తేలనుంది.












Click it and Unblock the Notifications