బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు.. రూ. 19 వేలకు ఒక్కో టికెట్! .
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2026 టికెట్ల బ్లాక్ మార్కెట్ దందా కలకలం రేపింది. స్టేడియం ఆవరణలోని శ్రీలక్ష్మి క్యాంటీన్‌లో పనిచేసే చంద్రశేఖర్ అనే వ్యక్తిని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి భారీ సంఖ్యలో ఐపీఎల్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక స్టేడియం ఇన్‌సైడర్లు, కొన్ని కార్పొరేట్ సంస్థల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఏప్రిల్ 15న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టికెట్లను చంద్రశేఖర్ బ్లాక్‌లో విక్రయిస్తూ పట్టుబడ్డాడు. అసలు ధర కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా.. ఒక్కో టికెట్‌ను రూ. 15,000 నుంచి రూ. 19,000 వరకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. బల్క్ టికెట్ల కొనుగోలుపై అందిన పక్కా సమాచారంతో నిఘా పెట్టిన సీసీబీ అధికారులు చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. టికెట్‌జెనీ ప్లాట్‌ఫామ్ ద్వారా 'స్వాస్టిక్ హెవీ ఇంజనీరింగ్', 'ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కన్సల్టెంట్', 'ధరణి కంప్యూటర్స్' వంటి ప్రైవేట్ కంపెనీల పేర్లతో భారీగా టికెట్లు బుక్ అయ్యాయి. ఇలా కార్పొరేట్ కోటా కింద లేదా బల్క్ బుకింగ్స్ ద్వారా పొందిన టికెట్లను బహిరంగ మార్కెట్లోకి మళ్లించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కేవలం ఏప్రిల్ 15 మ్యాచ్ మాత్రమే కాకుండా మార్చి 28న జరిగిన ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌లో కూడా ఇదే తరహాలో 81 టికెట్లను బ్లాక్‌లో అమ్మినట్లు తేలింది.
మొత్తంగా రూ. 17,52,600 విలువైన 181 టికెట్లను అక్రమంగా విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు చంద్రశేఖర్‌ను విచారించగా.. కేఎస్‌సీఏ సభ్యుడు గణేష్ పరీక్షిత్ తనకు ఈ టికెట్లు సరఫరా చేశాడని.. వాటిని ఎక్కువ ధరకు అమ్మాలని సూచించాడని తెలిపాడు. ప్రస్తుతం గణేష్ పరీక్షిత్ పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే టికెట్ల మళ్లింపులో సహకరించిన ప్రైవేట్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications