IPL 2024: లక్నోపై గెలిచి ఆ టీమ్ ను ఇంటికి పంపిన సన్ రైజర్స్..! ప్లే ఆఫ్స్ నుంచి అవుట్..
నిన్న ఐపీఎల్ 2024 లో భాగంగా హైదరాబాద్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై సన్ రైజర్స్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించడమే కాకుండా సునాయాసంగా 10 వికెట్ల రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సన్ రైజర్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో ముందంజ వేసింది. పాయింట్ల పట్టికలో నెట్ రన్ రేట్ ను సైతం మెరుగుపర్చుకుంది. ఎన్నో రికార్డులను తిరగరాసింది. దీంతో పాటు ఓ జట్టును ప్లేఆఫ్ రేసు నుంచి ఇంటికి కూడా పంపేసింది.
లక్నో సూపర్ జెయింట్స్ పై నిన్న సొంత గడ్డ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన ఏకపక్ష విజయం ముంబై ఇండియన్స్ జట్టును ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి బయటికి పంపింది. అంతే కాదు ఈ సీజన్ లో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా కూడా ముంబై చెత్త రికార్డు మూటగట్టుకుంది. దీంతో ముంబైపై అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇప్పటికే ఈ సీజన్ లో రోహిత్ శర్మ స్ధానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేసిన మార్పుతో వచ్చిన సమస్యల్ని పరిష్కరించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్న ముంబై ఇండియన్స్ కు ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవాల్సి రావడం శరాఘాతంగా మారింది. టోర్నీలో ఇక మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి పరువు కాపాడుకునేందుకు ముంబై పోరాడాల్సిన పరిస్ధితి. దీంతో ముంబై దీన స్థితిపై ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ట్రోలింగ్ ఎక్కువవుతోంది.

మరోవైపు లక్నోపై అసాధారణ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ తన పాయింట్లను 12 నుంచి 14కు పెంచుకుంది. మిగిలిన రెండు మ్యాచ్ ల్లోనూ సన్ రైజర్స్ గెలిస్తే కచ్చితంగా ప్లేఆఫ్స్ కు అర్హత సాధించే అవకాశాలున్నాయి. ఇప్పటికే టాప్ లో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కు చెరో 16 పాయింట్లు ఉన్నాయి. అలాగే మరో మూడేసి మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వీటిలో కనీసం ఒకటి గెలిచినా అవి ప్లేఆఫ్స్ కు అర్హత సాధించడం ఖాయం. ఈ లెక్కన చూస్తే ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో తొలి మూడు బెర్తులు దాదాపు ఖరారైనట్లే.












Click it and Unblock the Notifications