సీఎం రేవంత్ రెడ్డి టికెట్లు నటి చేతికి ఎలా?
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల వ్యవహారం ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రోటోకాల్ ప్రకారం అందజేయాల్సిన కాంప్లిమెంటరీ టికెట్లు.. ఓ యువ నటి చేతికి చిక్కడం రాజకీయ, క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వెలుగులోకి వచ్చిందిలా..
ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన అత్యంత ఖరీదైన 'సన్‌రైజర్స్ ఎలైట్ లాంజ్' టికెట్లు ఓ నటి వద్ద ఉన్నాయనే విషయం ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో బయటపడింది. మోడల్, నటి అయిన కుషిత కల్లాపు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ రెండు టికెట్ల ఫోటోలను షేర్ చేసింది. ఒక్కో టికెట్ విలువ సుమారు రూ.40,000 వరకు ఉంటుందని సమాచారం. ఈ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సీఎంవోకి వెళ్లాల్సిన పాస్‌లు ఆమెకు ఎలా అందాయనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

కుషిత కల్లాపు ఎవరు?
కుషిత కల్లాపు తెలుగులో 'చాంగురే బంగారు రాజా', 'నీతోనే నేను', 'బాబు - నంబర్ 1 బుల్‌షిట్ గాయ్' వంటి చిత్రాల్లో నటించింది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సాధారణంగా ఫ్రాంచైజీలు లేదా స్టేడియం అధికారులు ప్రభుత్వ సమన్వయం, భద్రతా ప్రోటోకాల్ కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ పాస్‌లను పంపిస్తారు. అయితే అవి అధికారిక అతిథులకు లేదా భద్రతా సిబ్బందికి ఉపయోగపడాలి తప్ప, ఇలా ప్రైవేట్ వ్యక్తులకు పంపిణీ చేయడం నైతిక, చట్టపరమైన విమర్శలకు దారితీస్తుంది.
హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య పాత గొడవలు
విశేషమేమిటంటే.. గతంలోనే కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్‌రైజర్స్ యాజమాన్యం మధ్య వివాదాలు నడిచాయి. అదనపు టికెట్ల కోసం హెచ్‌సీఏ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతోందని అప్పట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజర్ ఆరోపించారు. ఈ వివాదంపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని విచారణకు కూడా ఆదేశించారు. ఇప్పుడు మళ్లీ అదే ముఖ్యమంత్రి కోటా టికెట్లు పక్కదారి పట్టడం గమనార్హం.
బాధ్యత ఎవరిది?
ప్రభుత్వ అధికారులకు లేదా రాజకీయ ప్రతినిధులకు అందజేసే ప్రోటోకాల్ పాస్‌లు వారి వ్యక్తిగత ఆస్తి కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ టికెట్లు నటి కుషిత చేతికి ఎలా వెళ్లాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ సీఎంవో సిబ్బంది లేదా మధ్యవర్తులు వీటిని దుర్వినియోగం చేసి ఉంటే, అది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతుంది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications