ఈ పిచ్ పైనే చేతులెత్తేశారంటే.. దండగే: టీమిండియా మాజీ లెజెండ్
ముంబై ఇండియన్స్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వికెట్లు తీయలేకపోవడంపై విమర్శలు గుప్పించారు. ఆదివారం రాత్రి రాయ్‌పూర్‌లో జరిగిన ఈ గేమ్‌లో ఆర్‌సీబీ వెన్నులో వణుకు పుట్టించాడు దీపక్ చాహర్. విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్, దేవదత్ పడిక్కల్ (12) వికెట్లు త్వరగా పడగొట్టాడు. అదే సమయంలో బుమ్రా విఫలం కావడం విమర్శలకు దారి తీసింది.
దీనిపై ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడాడు. చాహర్ బౌలింగ్ ప్రభావం చూపాక పిచ్ బుమ్రాకు అనుకూలంగా అనిపించిందని, అతను పుంజుకుంటాడని ఆశించినట్లు పేర్కొన్నారు. బుమ్రా స్టంప్స్‌పై బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని భావించినా, అది జరగలేదని, మరోసారి వికెట్ లెస్ అయ్యాడని మండిపడ్డాడు.

"దీపక్ చాహర్ రెండు వికెట్లు తీసినప్పుడు, జస్‌ప్రీత్ బుమ్రా బ్యాక్ ఆన్ ట్రాక్ వస్తాడనిపించింది. బుమ్రా ఫామ్ లోకి రాలేకపోయాడు. ఈ పిచ్ అతనికి అనుకూలంగా ఉన్నా కూడా సత్తా చాటలేకపోయాడు. అతను స్టంప్స్‌పై మరింత బౌలింగ్ చేసి, బ్యాటర్లను ఎల్బీడబ్ల్యూ లేదా బౌల్డ్ చేయగల తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాడని అనుకున్నా. అది వాస్తవరూపం దాల్చలేదు. బుమ్రా ఖచ్చితంగా బాగా బౌలింగ్ చేశాడు గానీ, అతని నుండి ఆశించిన వికెట్లు మాత్రం లోపించాయి.." అని తేల్చి చెప్పాడు.
ఈ సీజన్‌లో నిరాశజనక ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు బుమ్రా. 11 మ్యాచ్‌లలో మూడు వికెట్లే తీశాడు. 116.33 సగటు, 82.0 స్ట్రైక్ రేట్, 8.51 ఎకానమీ రేటును నమోదు చేసుకున్నాడు. అదే విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తావించాడు. ఇక ముందు కూడా పుంజుకొంటాడనే విశ్వాసం సన్నగిల్లిందని వ్యాఖ్యానించాడు.
ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను అయిదో స్థానంలో ప్రమోట్ చేయడం మాస్టర్‌స్ట్రోక్ అని కితాబిచ్చాడు ఇర్ఫాన్ పఠాన్. 46 బంతుల్లో 73 పరుగులు (4 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి కృనాల్ మ్యాచ్ గెలిపించాడు. ఫలితంగా, ఆర్‌సీబీ ప్రస్తుతం 11 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
జాకబ్ బెథెల్ జాగ్రత్తగా ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తాడని, కృనాల్ పాండ్యా దూకుడు పాత్ర పోషిస్తాడని చాలా స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నాడు. కృనాల్ బ్యాట్ చేసిన తీరు, అతను దాడి చేసిన విధానం నిజంగా ప్రశంసనీయమని అన్నాడు. బెంగళూరుకు దూకుడుగా ఆడగల ఓ బ్యాటర్ అవసరం ఉందని, అతనే లేకపోతే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు.












Click it and Unblock the Notifications