ధురందర్ 2 కంటే లాంగ్ మ్యాచ్! ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది. సాధారణంగా టీ20 మ్యాచ్‌లు నాలుగు గంటల్లోపు ముగుస్తాయి. కానీ వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ పోరు ఏకంగా 4 గంటల 23 నిమిషాల పాటు సాగింది. సూపర్ ఓవర్ లేకుండా ఐపీఎల్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు జరిగిన మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది. రాత్రి 7 గంటలకు టాస్ పడగా.. చివరి బంతి పడేసరికి సమయం దాదాపు రాత్రి 11:45 దాటిపోయింది.
ఈ సుదీర్ఘ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ టీమ్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య స్పందిస్తూ.. "ధురందర్ 2 సినిమా కంటే ఎక్కువ సేపు జరిగిన మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఇదే" అంటూ సరదాగా ట్వీట్ చేశారు. 'ధురందర్: ది రివెంజ్' సినిమా రన్-టైమ్ సుమారు 3 గంటల 50 నిమిషాలు కాగా.. ఈ క్రికెట్ మ్యాచ్ దాన్ని కూడా దాటేయడం విశేషం.

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ పట్టును బిగించింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ కేవలం 17 బంతుల్లోనే అర్థ శతకం బాది.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 78) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ ఈ మైదానంలో తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది.
మ్యాచ్ అనంతరం రజత్ పటిదార్ మాట్లాడుతూ.. ప్రతి మ్యాచ్‌లో తమ జట్టు 200 పైచిలుకు పరుగులు చేయడం కెప్టెన్‌గా తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందని అన్నాడు. స్పిన్నర్ కృనాల్ పాండ్యా కూడా బ్యాటర్ల ప్రదర్శనను ప్రశంసించాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో ఫిల్ సాల్ట్ ఆడిన తీరు.. కెప్టెన్ పటిదార్ ప్రదర్శిస్తున్న నిలకడ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications