బీసీసీఐకి మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు.. కానీ?
Mohsin Naqvi: దుబాయ్‌లో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ కీలక సమావేశంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ట్రోఫీ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఏసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇంతకు ముందు జరిగిన సంఘటనకు సంబంధించి బీసీసీఐకి క్షమాపణ చెప్పారు. కానీ జరిగిన విషయం సరైనది కాదని అంగీకరించారు.
క్షమాపణ చెప్పినా.. మొండి వైఖరి
క్షమాపణ చెప్పినప్పటికీ ఆసియా కప్ 2025 ట్రోఫీ, మెడల్‌ను బీసీసీఐకి అప్పగించడానికి మొహ్సిన్ నఖ్వీ ససేమిరా అన్నారు. ఈ అంశంపై సమావేశంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నఖ్వీ బీసీసీఐతో మాట్లాడుతూ.. భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దుబాయ్ కు వచ్చి ట్రోఫీని తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. "మీరు అక్కడ ఉన్నప్పుడు (ఫైనల్ రోజు) అతను ట్రోఫీ తీసుకోలేదు, ఇప్పుడేం అతనే స్వయంగా వచ్చి తీసుకుంటాడని మీరు అనుకుంటున్నారా?" అని గట్టిగా ప్రశ్నించింది.నఖ్వి క్షమాపణ చెప్పినప్పటికీ.. ట్రోఫీ, మెడల్స్ తిరిగి ఇవ్వాలనే తన వైఖరిని మార్చుకోకపోవడంతో ఈ వివాదం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

ఫైనల్ రోజు ఏం జరిగింది?
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. అయితే మ్యాచ్ అనంతరం భారత జట్టు పీసీబీ, ఏసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది. భారత ఆటగాళ్లు నఖ్వీ నుంచి కాకుండా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB) వైస్-ఛైర్మన్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవాలని కోరారు. కానీ, నఖ్వీ దీనికి అంగీకరించలేదు.
దీంతో మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని తీసుకుని తన హోటల్‌కు వెళ్లిపోయారు. భారత ఆటగాళ్లు సుమారు ఒక గంట పాటు వేచి చూసినా, చివరకు ట్రోఫీ లేకుండానే డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఈ వివాదం నేపథ్యంలోనే మొహ్సిన్ నఖ్వీ లాహోర్‌కు తిరిగి వెళుతున్నప్పటికీ, దాని ప్రభావం, ప్రతిస్పందనలు మీడియా, అభిమానుల మధ్య చాలా రోజులు చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఏసీసీలోనే ఈ విషయంలో విభేదాలు తలెత్తాయని, సీనియర్ అధికారులు ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారని సమాచారం.












Click it and Unblock the Notifications