పాక్ జట్టుకు ఘోర అవమానం: హోటల్ బిల్లు కట్టలేదని గెంటివేత!
ఒకప్పుడు ప్రపంచ హాకీని శాసించిన పాకిస్థాన్ హాకీ జట్టు పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారింది. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League) సందర్భంగా పాకిస్థాన్ హాకీ ఆటగాళ్లకు ఘోర అవమానం ఎదురైంది. పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ హోటల్ బిల్లులు చెల్లించకపోవడంతో హోటల్ యాజమాన్యం వారి బుకింగ్స్‌ను రద్దు చేసింది. దీంతో ఆటగాళ్లు గంటల తరబడి రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.
నమ్మించి నట్టేట ముంచిన ఫెడరేషన్
పాకిస్థాన్ హాకీ జట్టు పర్యటన కోసం కాన్‌బెర్రాలోని ఒక ఫోర్ స్టార్ హోటల్లో గదులను బుక్ చేసిన అధికారులు ఆటగాళ్లకు వెల్లడించారు. పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్, పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డ్ ఇప్పటికే అడ్వాన్స్ పేమెంట్ చేసినట్లు వారికి హామీ ఇచ్చారు. అయితే ఆటగాళ్లు హోటల్‌కు చేరుకోగానే.. "మాకు ఎలాంటి పేమెంట్ అందలేదు, మీ పేరు మీద బుకింగ్స్ లేవు" అని హోటల్ యాజమాన్యం స్పష్టం చేయడంతో ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు.

గంటల తరబడి రోడ్డుపైనే..
సుదీర్ఘ ప్రయాణం తర్వాత అలసిపోయి వచ్చిన ప్లేయర్లకు కనీసం విశ్రాంతి తీసుకోవడానికి గది, తినడానికి తిండి లేక గంటల తరబడి రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. హెడ్ కోచ్ తాహిర్ జమాన్ పాకిస్థాన్‌లోని ఉన్నతాధికారులను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ.. నిధుల కొరత, సమయ వ్యత్యాసం కారణంగా వెంటనే ఎలాంటి పరిష్కారం లభించలేదు. చివరికి స్థానిక పాకిస్థానీ కమ్యూనిటీ సభ్యులు కొందరు ముందుకు వచ్చి ఆటగాళ్లకు సహాయం చేయాల్సి వచ్చింది.
ఒక్కో గదిలో ముగ్గురు.. మైదానంలో ఓటమి
చాలా గొడవల తర్వాత హోటల్ యాజమాన్యం పరిమితంగా గదులను కేటాయించింది. గదుల కొరత కారణంగా ఒక్కో రూమ్‌లో ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు సర్దుకోవాల్సి వచ్చింది. సరిగ్గా నిద్ర, విశ్రాంతి లేని కారణంగా మరుసటి రోజే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 2-3 తేడాతో ఓటమిపాలైంది. ఈ ప్రో లీగ్‌లో పాక్ వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం.
వ్యవస్థాగత వైఫల్యమే కారణమా?
పాకిస్థాన్ హాకీ జట్టుకు ఇలాంటి అవమానాలు ఎదురవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అర్జెంటీనా పర్యటనలో కూడా ఆటగాళ్లకు రోజువారీ అలవెన్సులు సకాలంలో అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. క్రమశిక్షణా రాహిత్యం కారణంగా రెగ్యులర్ మేనేజర్ అంజుమ్ సయీద్‌ను తొలగించడంతో, ప్రస్తుతం జట్టు మేనేజర్ లేకుండానే పర్యటన కొనసాగిస్తోంది. జాతీయ క్రీడ అయిన హాకీకి పాక్ ప్రభుత్వం సరైన నిధులు కేటాయించకపోవడంతో ఫెడరేషన్ అప్పుల్లో కూరుకుపోయింది.
ఒలింపిక్స్‌లో పతకాలు, ప్రపంచకప్‌లో విజయాలతో ఒకప్పుడు హాకీ రారాజుగా వెలిగిన పాకిస్థాన్.. నేడు కనీసం హోటల్ బిల్లులు కట్టలేని స్థితికి చేరుకోవడం క్రీడాభిమానులను కలిచివేస్తోంది. మైదానంలో ఆట కంటే.. దేశంలోని పరిపాలనా వ్యవస్థ వైఫల్యమే ఆటగాళ్లను రోడ్డున పడేలా చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications