టీ20 వరల్డ్ కప్ లో మరిన్ని ట్విస్ట్ లు? భారత్-పాక్ మ్యాచ్ లేదా ?
టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి కేవలం రెండు వారాల గడువు మాత్రమే మిగిలున్నప్పటికీ ట్విస్ట్ లు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు దీనికి వేదికైన భారత ఉపఖండం అనూహ్యంగా వేడెక్కుతోంది. అదీ ఉపఖండపు జట్ల మధ్య జరుగుతున్న వార్ ను పాశ్చాత్య దేశాల జట్లు నిశితంగా గమనిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి బహిష్కరించాక మొదలైన ఈ వార్ ఇప్పుడు వరల్డ్ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ రద్దుకు దారి తీసేలా ఉంది.
ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ నుంచి తప్పించాక బంగ్లాదేశ్ భారత్ లో మ్యాచ్ లను భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బహిష్కరించింది. అలాగే తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలు కూడా చేయకూడదని నిర్ణయించింది. దీంతో ఐసీసీ కూడా చేసేది లేక బంగ్లాదేశ్ స్ధానంలో స్కాట్లండ్ కు వరల్డ్ కప్ ఆడే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ (pakistan) కూడా బంగ్లాదేశ్ కు మద్దతుగా వరల్డ్ కప్ బహిష్కరణ హెచ్చరికలు మొదలుపెట్టింది.

తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ తో సమావేశమైన పీసీబీ ఛీఫ్ నక్వీ మొత్తం వరల్డ్ కప్ టోర్నీని బహిష్కరించాలా లేక భారత్ తో మ్యాచ్ బహిష్కరించాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. అయితే వరల్డ్ కప్ లో ఆడే పాకిస్తాన్ జట్టును మాత్రం ఇప్పటికే ప్రకటించారు. అయినా వరల్డ్ కప్ ఆడే విషయంలో మాత్రం తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ శుక్రవారం లేదా సోమవారం గడువుగా నిర్ణయించినట్లు పీసీబీ ఛీఫ్ నక్వీ తెలిపారు. ఇందులో మొత్తం వరల్డ్ కప్ బహిష్కరించాలా లేక కేవలం భారత్ తో మ్యాచ్ మాత్రమే బహిష్కరించి బంగ్లాకు సంఘీభావం తెలపాలా అన్నది తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.

అయితే బంగ్లాదేశ్ తరహాలోనే పాకిస్తాన్ కూడా మొండికేస్తే ఐసీసీ మరో జట్టుకు టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశం కల్పించడం ఖాయం. అలాగే భారత్ తో మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరిస్తే ఆ మేరకు భారత్ కు మ్యాచ్ ఆడకుండానే గెల్చినట్లు పాయింట్లు ఇస్తారు. తద్వారా భారత్ కు మేలే జరుగుతుంది. మరోవైపు ఈ టోర్నీలో ఆడితే మాత్రం బంగ్లాదేశ్ కు సంఘీభావంగా చేతికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలపాలని పాకిస్తాన్ బోర్డు భావిస్తోంది. వీటిపై క్లారిటీ రావాలంటే కనీసం ఈ నెల 30 వరకూ ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications