పీవీ సింధు పతకాల వేట షురూ: అర్ధగంటలోనే గేమ్ ఫినిష్
PV Sindhu: పారిస్ ఒలింపిక్స్ 2024 రసవత్తంగా సాగుతోంది. ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్‌లో భారత్ ఇప్పటికే బోణీ కొట్టింది. రెండు కాంస్య పతకాలను తన సొంతం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కేటగిరీలో మనూభాకర్ రెండు పతకాలను సాధించారు. విమెన్స్ కేటగిరిలో సింగిల్‌గా, మిక్స్‌డ్ విభాగంలో సరబ్జొత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఇక స్టార్ షట్లర్ పీవీ సింధు వంతు వచ్చింది. మరో పతకానికి వేట మొదలైంది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ ఎం విభాగంలో జరిగిన తొలి గేమ్‌లో ఘన విజయాన్ని అందుకుంది పీవీ సింధు. ఈ మ్యాచ్ మొత్తాన్ని డామినేట్ చేసింది. ఏకపక్షంగా మార్చివేసింది. మ్యాచ్ మొదలు పెట్టిన 34 నిమిషాల్లోనే దీన్ని ముగించింది.

ఈస్టోనియాకు చెందిన క్రిస్టిన్ కూబాతో జరిగిన గేమ్ ఇది. 21-5, 21-10 సెట్ల తేడాతో తన ప్రత్యర్థిని మట్టికరిపించింది పీవీ సింధు. ఇందులో తొలి సెట్ 14 నిమిషాల్లోనే ముగించడం రికార్డ్. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదామె. బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్, పవర్ ఫుల్ గ్రౌండ్ షాట్లతో క్రిస్టిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. 21-5 తేడాతో దీన్నిగెలచుకుంది.
అదే దూకుడును రెండో గేమ్‌లోనూ కొనసాగించింది. 19 నిమిషాల్లో దీన్ని ముగించింది. ఈ విజయంతో పీవీ సింధు.. 16వ రౌండ్‌లోకి అడుగు పెట్టింది. దీన్ని ప్రీ క్వార్టర్ ఫైనల్‌గా భావించే రౌండ్ ఇది. ప్రీ క్వార్టర్స్‌లో ఆమె చైనాకు చెందిన స్టార్ షట్లర్ బింగ్‌జియావోను ఎదుర్కొనే అవకాశం ఉంది. 2021 నాటి టోక్యో ఒలింపిక్స్‌లో ఇదే బింగ్‌జియావోను ఓడించి.. కాంస్య పతకాన్ని అందుకుంది పీవీ సింధు.












Click it and Unblock the Notifications