IPL 2026: శ్రీలంక బోర్డుపై కేసు వేసిన ఆర్సీబీ ప్లేయర్ -షాకింగ్ రీజన్..!
ఇండియన్ క్రికెట్ లీగ్ (IPL 2026)లో ఈసారి పలు సంచలనాలు నమోదవుతున్నాయి. అవి ఆటపరంగానే కాదు, ఇతరత్రా కారణాలతో కూడా. ఇదే క్రమంలో తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాడు ఒకరు తన దేశ క్రికెట్ బోర్డుపైనే కేసు వేశాడు. దీని వెనుక ఉన్న కారణం ఐపీఎల్ తో లింక్ అయి ఉండటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతకీ శ్రీలంక క్రికెట్ బోర్డుపై కేసు వేసిన ఆ దేశ ఆటగాడెవరో చూద్దాం..
ఐపీఎల్ 2026లో పాల్గొనడానికి తనకు నిరభ్యంతర పత్రం (NOC) ఇవ్వకపోవడంతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో శ్రీలంక పేసర్ నువాన్ తుషార.. శ్రీలంక క్రికెట్ బోర్డు ఉన్నతాధికారులపై కేసు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. నిర్దేశించిన ఫిట్‌నెస్ ప్రమాణాలను అందుకోలేకపోవడంతో తుషారకు ఎన్వోసీ మంజూరు చేయలేదు. అయితే ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడేందుకు తనను అనుమతించాలని శ్రీలంక బోర్డును ఆదేశించాలని కోరుతూ ఈ పేసర్ కేసు దాఖలు చేశారు. అలాగే తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించుకోవాలనుకోవడం లేదని కూడా తుషార శ్రీలంక బోర్డుకు తెలిపాడు.

శ్రీలంకకు చెందిన మీడియా సంస్థ న్యూస్‌వైర్ నివేదిక ప్రకారం.. తుషార తన ఫిర్యాదులో శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా, కార్యదర్శి బందుల దిస్సనాయకే, కోశాధికారి సుజీవ గొడలియడ్డ, సీఈఓ ఆష్లే డిసిల్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నాడు.
ఏప్రిల్ 9న ఈ కేసు విచారణకు రానుంది. కొలంబో జిల్లా కోర్టు దీనిని ఇవాళ విచారణకు స్వీకరించనుంది. శ్రీలంక బోర్డుతో తన ఒప్పందం మార్చి 31న ముగియాల్సి ఉందని, ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇష్టపడటం లేదని, అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకోవాలనుకుంటున్నానని తాను బోర్డుకు తెలియజేసినట్లు తుషారా పేర్కొన్నాడు. తన కెరీర్‌లో చాలా కాలం పాటు తన ఫిట్‌నెస్ స్థాయి అలాగే ఉందని, గతంలో ఇది తనకు NOC పొందే అవకాశాలకు ఆటంకం కలిగించలేదని కూడా తుషారా వాదిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications