టీమిండియా స్టార్ బ్యాటర్ చేతికి బలంగా తాకిన బంతి- రిటైర్డ్ హర్ట్
కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ కుదురుకుంది. మొదటి ఇన్నింగ్ కు బలమైన పునాది పడింది. భారీ స్కోర్ దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. నల్లేరు మీద నడకలా సాగుతోంది టీమిండియా బ్యాటింగ్. మొదటి టెస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో దేవ్ దత్ పడిక్కల్ మరోసారి ఈ మార్క్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం పడిక్కల్- 85, కేప్టెన్ శుభ్ మన్ గిల్- 50 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆడుతున్నారు. జట్టు స్కోరు 37 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరో వికెట్ పడటానికి ఎంతో సమయం పట్టలేదు. 66 పరుగుల వద్ద రెండో వికెట్ గా యశస్వి జైస్వాల్ వెనుదిరిగాడు. ఈ దశలో పడిక్కల్, శుభ్ మన్ గిల్ క్రీజ్ లో కుదురుకున్నారు. అడపాదడపా భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తోన్నారు.

జైస్వాల్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా ధాటిగానే ఆడినప్పటికీ.. గాయపడటం కలవరపాటుకు గురి చేసింది. 58వ ఓవర్ మొదటి బంతికి లంక పేసర్ లాహిరు కుమార సంధించిన ఓ డెలివరీ అతని చేతిని బలంగా తాకింది. దీంతో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఈ ఊహించని పరిణామంతో భారత డ్రెస్సింగ్ రూమ్‌తో పాటు అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తింది.
లాహిరు కుమార వేసిన షార్ట్ పిచ్ డెలివరీ అది. దాన్ని పుల్ షాట్ ఆడేందుకు పంత్ ప్రయత్నించాడు. బంతి ఊహించని వేగంతో దూసుకురావడంతో టైమింగ్ మిస్ అయ్యాడు. బ్యాట్‌కు అందలేదు. నేరుగా గ్లోవ్స్‌ను తాకుతూ ఎడమ చేతి మణికట్టు ఎముకకు బలంగా తగిలింది. ఆ వెంటనే పంత్ తీవ్ర నొప్పితో విలవిలలాడాడు. మణికట్టుపై వాపు సైతం కనిపించింది.
జట్టు ఫిజియో వాపు రాకుండా ఉండటానికి ఐస్ ప్యాక్ పెట్టాడు. నొప్పి తీవ్రతను తగ్గించడానికి మణికట్టుకు టేప్ కట్టాడు. అయినప్పటికీ నొప్పి ఏమాత్రం తగ్గకపోవడంతో బ్యాటింగ్ కొనసాగించడం పంత్‌కు సాధ్యపడలేదు. చివరకు అంపైర్లతో మాట్లాడిన అనంతరం, పంత్ మైదానాన్ని వీడాడు. అతను రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. అతని స్థానంలో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా క్రీజ్ లోకి వచ్చాడు. రిషబ్ పంత్ గాయం తీవ్రత ఎంత అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది.













Click it and Unblock the Notifications