భారత్-పాకిస్తాన్ మ్యాచ్: టీవీలు పగులుతున్నాయ్: మతం అడిగి చంపిన వాళ్లతో గేమ్సా?
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్‌లో నేడు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పహల్గామ్ ఉగ్రవా దాడులు, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ ఇది. దీనిపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల నిరసనలు జరుగుతుండగా, మరికొన్ని చోట్ల టీమిండియా విజయం కోసం పూజలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో బాయ్ కాట్ బీసీసీఐ ట్రెండింగ్ అవుతోంది.
మహారాష్ట్ర, కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్.. వంటి రాష్ట్రాల్లో మ్యాచ్ పై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నాయకులు, కార్యకర్తలు టీవీలను పగలగొట్టి నిరసన తెలిపారు. తమ ఇళ్లల్లో నుంచి టీవీలను రోడ్డు మీదికి తీసుకొచ్చి ధ్వంసం చేశారు. వాటిని కాళ్లతో తొక్కారు. తుక్కు తుక్కు చేశారు. పగిలిన టీవీలను బీసీసీఐకి కానుకగా పంపిస్తామని అన్నారు.

అటు పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాలు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నాయి. రక్తపు మరకలు అంటిన చేతులు ఉన్నవారితో భారత్ మ్యాచ్ ఆడుతోందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్ దాడిలో మరణించిన 26 మంది పౌరుల ప్రాణాల కంటే మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బుకు బీసీసీఐ విలువ ఇస్తోందని మండిపడ్డారు. దీన్ని ఆపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని డిమాండ్ చేస్తోన్నారు.
శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ పాకిస్తాన్ పంపించిన ఉగ్రవాదులు పహల్గామ్ లో పర్యాటకుల మతం అడిగి హిందువులను మాత్రమే కాల్చి చంపారని, అలాంటి వాళ్లతో ఇప్పుడు మనం మ్యాచ్ ఆడాల్సి రావడం వల్ల సిగ్గు పడుతున్నానని అన్నారు. 26 మంది మహిళలు నుదుట సింధూరాన్ని తుడిచిన రక్తపు చేతలతో క్రికెట్ సంబంధాలను ఇంకా కొనసాగించడం ఏ రకంగా కూడా సమర్థనీయం కాదని అన్నారు.
శివసేన (యూబీటీ) మహిళా నాయకులు, కార్యకర్తలు తమ సింధూరాన్ని సేకరించి ప్రధాని మోదీకి అందజేయాలని నిర్ణయించుకున్నారని అరవింద్ సావంత్ తెలిపారు. పహల్గామ్ దాడి అమరవీరుడి భార్య స్పందన చూసిన తర్వాత కూడా మ్యాచ్ ఆడాలా ఉందా? అని నిలదీశారు. ప్రధాని మోదీ యుద్ధాలను ఆపగలరు కానీ క్రికెట్ మ్యాచ్‌ను ఆపలేరని ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కేరళలో ఉద్ధవ్ వర్గం నాయకులు పాకిస్తాన్ జాతీయ జెండాను దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications